బెయిల్ పై బయటకొచ్చిన దస్తగిరి... జగన్ పై సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా స్పందించిన అతడు... పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నాడు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. ఎట్రాసిటీ, దాడి కేసుల్లో నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్ పై తాజాగా విడుదలయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడిన దస్తగిరి సీఎం వైఎస్ జగన్ పైనా.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిపైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా ఎన్నికల్లో ఓట్లు ఎడగాలో కూడా చెబుతూ సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చాడు.
అవును... వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తాజాగా మరోకేసులో బెయిల్ పై విడుదలయ్యాడు. ఈ సందర్భంగా స్పందించిన అతడు... పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నాడు. వివేకా హత్యకు సంబంధించి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అప్రూవర్ గా మారినట్లు తెలిపాడు. ఈ సమయంలో సీఎం, ఎంపీ మాట విని మరో తప్పు చేయదలచుకోలేదని చెప్పడం గమనార్హం!
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పలు వ్యాఖ్యలు చేశాడు దస్తగిరి. ఇందులో భాగంగా... వివేకా హత్యను అడ్డం పెట్టుకుని జగన్ సానుభూతితో గత ఎన్నికల్లో గెలుపొందారని, ఇప్పుడు మరోసారి అదే కుట్రతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. ఇక.. వివేకా కేసులో అప్రూవర్ గా ఉండటం వల్లే తనపై కుట్ర పన్ని, కేసుల్లో ఇరికించి తనను జైలుకు పంపారని తెలిపాడు.
ఎట్రాసిటీ, దాడి కేసుల్లో తాను నాలుగు నెలలు కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో.. వివేకా కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి తనను కలిశారని, డబ్బు ఆశ చూపి రాజీకి రావాలని అభ్యర్థించారని చెప్పుకొచ్చాడు దస్తగిరి! ఇదే సమయంలో సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభ పెట్టారని.. అయితే అందుకు తాను అంగీకరించేది లేదని తేల్చి చెప్పినట్లు తెలిపాడు.
ఇదే క్రమంలో "సిద్ధం" సభల్లో వివేకాను హత్య చేసిందెవరో జగన్ చెబితే బాగుంటుందని వ్యాఖ్యానించిన దస్తగిరి... ఈసారి వివేకాను ఎవరు హత్య చేశారో చెప్పి ఓట్లు అడగాలని జగన్, అవినాష్ లను డిమాండ్ చేశాడు. అక్కడితో ఆగని దస్తగిరి... వారిద్దరూ వచ్చే ఎన్నికల్లో పులివెందులలో ఓట్లు అడిగే పక్షంలో ప్రజలు రాళ్లు వేస్తారని హెచ్చరించడం గమనార్హం!