7 వేల కోట్లకు టోపీ.. 20 వేల మంది హైదరాబాదీలే!
ఈ కేసు ఇంకా తేలకముందే.. ఇప్పుడు తాజాగా హైదరాబాదులో 'డీబీ స్టాక్ బ్రోకింగ్' కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది.
ఒకటి కాదు.. రెండు ఏకంగా వేల కోట్ల కుంభకోణం. అందునా.. 20 వేల కు బాధితులు హైదరాబాద్‌కు చెంది న వారే. దీంతో ఇప్పుడు తెలంగాణ సర్కారుకు ఈ కుంభకోణం గుట్టు తేల్చడం.. పెను సవాల్‌గా మారింది. గడిచిన మూడు మాసాల్లో ఇలా వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూడడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఆగస్టులో 175 కోట్ల రూపాయల మేరకు మోసం చేశారంటూ.. ఆన్‌లైన్ కంపెనీలపై ఫిర్యాదులు రావడం.. బాధితులు పోటెత్తడం తెలిసిందే.
ఈ కేసు ఇంకా తేలకముందే.. ఇప్పుడు తాజాగా హైదరాబాదులో 'డీబీ స్టాక్ బ్రోకింగ్' కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. స్టాక్ బ్రోకింగ్‌లో రూ. 7000 కోట్ల మేరకు డీబీ కంపెనీ కుంభకోణానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో వేలాది మంది హైదరాబాదీలు.. సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. అధిక లాభాలు ఆశ చూపెట్టి మోసాలకు పాల్పడినట్టు డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీపై ప్రాథమికంగా చేపట్టిన విచారణలో పోలీసులు గుర్తించారు.
డిపి స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్‌తో పాటు పలువురుపై కేసులు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దీనిని స్టాక్ ఎక్సేంజ్ అధికారులకు అందించనున్నట్టు తెలిసింది. ఇక, ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారిలో ఒక్క హైదరాబాదీలే కాకుండా ముంబై, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీతో పలు ప్రధాన నగరాలకు చెందిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ బాధితుల్లో 20 వేల మందికి పైగా హైదరాబాదీలే ఉన్నారని లెక్కగట్టారు.
బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు బాధితులు ఫిర్యాదులు చేశారు. ఇప్పటి వరకు హైదరాబాదులో 13 వేల మంది డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేయడం గమనార్హం.
ఏపీలోనూ.. మోసం!
మరోవైపు.. ఏపీలోని ప్రఖ్యాత బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐలోనూ వేల కోట్ల రూపాయల మోసం జరిగింది. ముందుగా చిలకలూరిపేటలోని బ్రాంచ్‌లో వెలుగు చూసిన ఈ మోసం.. ఇప్పుడు నరసరావుపేటకు కూడా పాకింది. వేలాది మంది సొమ్మును మాజీ మేనేజర్లు, అకౌంటెంట్లు పంచేసుకున్నారు. కిలోల కొద్దీ కుదువ పెట్టిన బంగారానికి.. నకిలీ రసీదులు ఇచ్చి.. దానిని కూడా అమ్మేసుకున్నారు. దీంతో ప్రజల సొమ్ముకు భద్రత ఎక్కడుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.