రాజుగారు డిప్యూటీ స్పీకర్ అవుతున్నారుగా !

డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంతో మంది పేర్లు వచ్చినా వాటిని పరిశీలించినా కూడా బాబు మనసు మాత్రం రఘురామ క్రిష్ణం రాజు మీదనే ఉంది అని అంటున్నారు.

Update: 2024-11-13 03:44 GMT

ట్రిపుల్ ఆర్ గా ఏపీ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న రఘురామ క్రిష్ణం రాజుకు ఎట్టకేలకు ఒక కీలకమైన పదవి దక్కుతోంది. ఆయనకు ఉప సభాపతి పదవిని ఇచ్చేందుకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి కూటమి పెద్ద అయిన చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అంగీకరించారు అని అంటున్నారు.

డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంతో మంది పేర్లు వచ్చినా వాటిని పరిశీలించినా కూడా బాబు మనసు మాత్రం రఘురామ క్రిష్ణం రాజు మీదనే ఉంది అని అంటున్నారు. దాంతో రాజు గారు ఏపీ శాసన సభలో ఉప సభాపతి అవడం నూరు పాళ్ళు ఖాయమని అంటున్నారు.

నిజానికి అయిదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం మీద జగన్ మీద తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా రాజకీయ రచ్చబండను ఢిల్లీ వేదికగా నిర్వహించి ఏపీలో వైసీపీ అనుకూల వాతావరణాన్ని పూర్తిగా ప్రతికూలంగా మార్చిన వారిలో రఘురామ కూడా కీలకంగా ఉంటారు.

ఆయన ఎంపీ అయి కేంద్ర మంత్రి కావాలని తలిస్తే విధి మరోలా తలచింది. దాంతో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. అయిదు నెలల ప్రభుత్వ పాలన సాగుతున్నా ఆయనకు ఏ పదవీ దక్కలేదు. మంత్రి కావాలనుకున్నారు, స్పీకర్ సీటు వైపు చూసారు. టీటీడీ చైర్మన్ పోస్టు కోసం కూడా చూసారు కానీ ఏవీ దక్కలేదు.

దాంతో ఇటీవల ఆయన ఒక యూ ట్యూబ్ చానల్ లో సైతం తన ఆవేదనను వెళ్ళగక్కారు. జస్ట్ ఎమ్మెల్యేను అంటూ ఆయన తనలోని ఫైర్ ని చెప్పకనే చెప్పేశారు. మరి కూటమి పెద్దలకు రాజు గారి మనసులోని బాధ ఆయన హృదయానువాదం అర్ధం అయ్యాయో ఏమో కానీ వెంటనే ఆయనకు కీలకమైన పదవి వరించి వచ్చేసింది.

స్పీకర్ పదవి అనుకుంటే డిప్యూటీ స్పీకర్ అయింది. అయితే కేబినెట్ ర్యాంక్ పదవిగానే ఈ పోస్టు ఉంటుంది. ప్రోటోకాల్ కి మర్యాదలకు తక్కువ ఉండదు. ఏమీ లేని కాని విధంగా ఉండడం కంటే రాజ్యాంగ బద్ద పదవిలో కుదురుకోవడం బెటర్. మొత్తం మీద రఘురామకు ఆలస్యంగా అయినా న్యాయం జరిగింది అని అంటున్నారు.

ఇక ఈ బడ్జెట్ సెషన్ లోనే ఉప సభాపతి ఎంపిక జరుగుతుంది. అంతే కాదు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ పదవిని చేపట్టడం కూడా లాంచనమే అని అంటున్నారు. మొత్తానికి ట్రిపుల్ ఆర్ తన దర్జా దర్పానికి తగిన పదవినే అందుకున్నారని అంతా అంటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి ఈ విధంగా తగిన న్యాయం చేశారని అంటున్నారు. ఎపుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఎలా ఇవ్వాలో బాబు కంటే ఎవరికీ తెలియదు అని అంటారు. ఆ విధంగా ఆయన రఘురామను రాజ్యాంగ పదవిలో కూర్చోబెడుతున్నారు. ఆయన రాజసాన్ని నిలబెడుతున్నారు అని అంటున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, అంతా రఘురామకు బెస్ట్ విషెస్ చెప్పడమే మిగిలింది అని అంటున్నారు.

Tags:    

Similar News