రఘురామ డిప్యూటీ స్పీకర్...జగన్ అసెంబ్లీకి వస్తారా ?
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు గైర్ హాజరవుతున్నారు. బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సభకు రావడం లేదు.
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు గైర్ హాజరవుతున్నారు. బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సభకు రావడం లేదు. దీనికి వైసీపీ చీఫ్ జగన్ ఒక విషయం చెప్పారు. తాము అసెంబ్లీకి వెళ్తే మైక్ ఇవ్వరని ఆయన అన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా కోరుతున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీలో అయిదేళ్ళ పాటు రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామ క్రిష్ణం రాజు ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఉప సభాపతి అయ్యారు. రఘురామ ఉప సభాపతిగా అసెంబ్లీలో ఉన్న వేళ జగన్ అసెంబ్లీకి వస్తారా అని కొత్త చర్చను లేవనెత్తుతున్నారు
రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని కూడా చెప్పాలి. వారు వీరు అవుతారు, అధికారం అటూ ఇటూ మారుతుంది. అయితే ఏపీలో రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే ప్రపంచ రాజకీయాల్లోనూ మార్పులు వస్తున్నాయి. దేశ రాజకీయాలూ కూడా మారుతున్నాయి.
వాటన్నింటి కంటే ప్రత్యేకంగా ఏపీ రాజకీయాలు ఉండడం విశేషం. ఇక్కడ టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా రాజకీయం సాగుతోంది. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ అలాగే ఏపీలో మరో ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన కూటమిలో చేరడంతో టీడీపీ బలం రెట్టింపు అవుతోంది. ఈ మొత్తం పరిణామాలలో వైసీపీ ఒంటరిగానే రాజకీయ పోరాటం చేస్తోంది.
ఇక అసెంబ్లీలో చూస్తే వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారు మినహా మిగిలిన 164 మంది ఎమ్మెల్యేలు కూటమి వైపే ఉన్నారు. అంటే తొంబై 95 శాతానికి పైగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు అన్న మాట. దాంతో వైసీపీ అధికార పార్టీ మీద గట్టిగా ప్రశ్నించినా కూడా దానికి భారీగానే కౌంటర్లు ఆ వైపు నుంచి వస్తాయి.
ఇక వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించేందుకు సీట్లు తక్కువగా ఉన్నందున కుదరదు అని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీకి మైకు ఇచ్చినా ఎంత సేపు ఇస్తారు ఏమిటి అన్నది సభా పతులు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే వైసీపీకి సభలో గళం విప్పే చాన్స్ దక్కినా వారు చేసే విమర్శలు సూచనలను అన్నీ కూడా కూటమి ముందు తేలిపోయే చాన్స్ ఉందని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలో ఎంపీగా ఉంటూ నాలుగున్నరేళ్ల పాటు రెబెల్ గా వ్యవహరించడమే కాకుండా ఆ పార్టీకి మొదటి ఆరు నెలలలోనే పొలిటికల్ గా ఇబ్బందులు పెట్టడంలో ముందున్న రాఘురామ డిప్యూటీ స్పీకర్ గా సభను నిర్వహిస్తున్న వేళ వైసీపీ అధినేత సభకు వెళ్తారా అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలో రఘురామ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సభ్లో ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ అసెంబ్లీకి రారు అని మంత్రి వంగలపూడి అనిత అనడం విశేషం. దీని మీద ప్రజలు 11 రూపాయలు పందెంగా పెట్టి మరీ చెబుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
మరో వైపు చూస్తే రఘురామ క్రిష్ణం రాజుని ఉప సభాపతిగా స్పీకర్ ఆసనంలో ముఖ్యమంత్రి సభా నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు గౌరవంగా కూర్చోబెట్టారు. ఆయన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సినిమాల్లో ట్రిపుల్ ఆర్ ఎంత ఫ్యామస్ గా ఉందో రాజకీయాల్లో రఘురామ అంత ఫ్యామస్ అన్నారు.
రఘురామది కల్మషన్ లేని వ్యక్తిత్వం అని కొనియాడారు, ముక్కుసూటిగా ఆయన ఉంటారని అదే ఆయనకు కొన్ని సార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టిందని అన్నారు. ఆయన వైసీపీ ఎమెపెగా ఉన్నపుడు పోలీస్ కస్టడీకి తీసుకుని నానా రకాలుగా ఇబ్బందుల పాలు చేశారని ఆయనని గాయాల పాలు అయ్యేలా చేశారని బాబు చెప్పారు. రఘురామ నాయకత్వంలో శాసనసభ మరింత హుందాగా నడుస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సభ మొత్తం రఘురామ గురించి మంచిగా మాట్లాడడమే కాకుండా ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.