ధర్మాన సోదరుల రిటైర్మెంట్?

గత ఎన్నికల్లోనే పోటీకి విముఖత చూపిన ధర్మాన బ్రదర్స్ తమ బదులుగా వారసులను రంగంలోకి దింపాలని ప్లాన్ చేశారు.

Update: 2024-12-21 12:30 GMT

వైసీపీ సీనియర్ నేతలు, శ్రీకాకుళం జిల్లాలోని ఆ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ధర్మాన సోదరుల రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఈ ఇద్దరు నేతలు రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే పోటీకి విముఖత చూపిన ధర్మాన బ్రదర్స్ తమ బదులుగా వారసులను రంగంలోకి దింపాలని ప్లాన్ చేశారు. అయితే వీరి ప్రతిపాదనకు పార్టీ చీఫ్ జగన్ అంగీకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారే పోటీ చేయాల్సివచ్చింది. వయసు పైబడటంతో విశ్రాంతి కోరుకుంటున్న ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల నుంచి తప్పుకోవాలంటే ఇప్పటి నుంచే రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. తమ స్థానంలో తమ పిల్లలను బరిలోకి దించే వ్యూహంలో భాగంగా వారిని క్షేత్రస్థాయిలో తిప్పుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మంత్రిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉంది. 1989, 2004, 2009, 2019ల్లో ఏర్పడిన టీడీపీయేతర ప్రభుత్వాల్లో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా పనిచేశారు. జగన్ ప్రభుత్వంలో తొలి రెండున్నరేళ్లు ప్రసాదరావుకు బదులుగా ఆయన అన్న ధర్మాన క్రిష్ణదాస్ మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ధర్మాన ప్రసాదరావు పూర్తి విశ్రాంతి కోరుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల పార్టీ నిర్వహించిన రైతు ఆందోళనల్లోనూ ధర్మాన జాడలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన, తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడిని గత ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీకి పెట్టాలని చూశారు. కానీ, అధిష్టానం అందుకు అంగీకరించలేదు. విధిలేక పోటీకి దిగిన ధర్మాన ప్రసాదరావు 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ భారీ పరాజయంతో మనస్థాపం చెందిన ధర్మాన ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగుతున్నా, సన్నిహితులు మాత్రం ఆ ప్రచారన్ని కొట్టిపడేస్తున్నారు. ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్న ధర్మాన పార్టీ మారడం అంటూ ఉండదంటున్నారు.

ఇక ధర్మాన ప్రసాదరావు సోదరుడు క్రిష్ణదాస్ కూడా గత ఎన్నికల్లో నరసన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన ఈయన ఒక ఉప ఎన్నికతో సహా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. వచ్చే ఎన్నికల నాటికి 75 ఏళ్ల వయసు వస్తున్నందున తన బదులు తన కుమారుడు క్రిష్ణ చైతన్యను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ణదాస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా, మళ్లీ పోటీ చేసే ఉద్దేశంలో లేరని చెబుతున్నారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు నేతలు ఒకేసారి రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తుండటం వైసీపీకి కొంతమేర నష్టమని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News