మినీ స్కూల్‌ బస్సు కంటే పొడవైన గోళ్లు.. ఎవరీ మహిళ?

అవును... ప్రపంచలోని కొంతమంది వ్యక్తులు రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తుంటారు.

Update: 2024-05-25 23:30 GMT

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ది అంటారు! ప్రధానంగా రికార్డ్స్ నెలకొల్పాలని.. ప్రపంచంలోని మనుషులందరికంటే ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించే చాలా మంది రోటీన్ కి భిన్నంగా ఆలోచిస్తుంటారని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా ఒక మహిళ ఇలానే ఆలోచించినట్లున్నారు. ఫలితంగా తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ని సొంతం చేసుకున్నారు.


అవును... ప్రపంచలోని కొంతమంది వ్యక్తులు రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తుంటారు. ఫలితంగా రికార్డ్స్ సృష్టిస్తుంటారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌ స్ట్రాంగ్ అనే మహిళ కూడా డిఫరెంట్ గా ఆలోచించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతి గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు.


డయానా ఆర్మ్‌ స్ట్రాంగ్ చేతికి 1,306.58 సెం.మీ (42 అడుగుల 10.4 అంగుళాల) పొడవైన గోళ్లు ఉన్నట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. ఆమె సుమారు 25 ఏళ్లుగా తన గోళ్లను పెంచుతోందని తెలిపారు. ప్రస్తుతం అవి మినీ స్కూల్‌ బస్సు కంటే పొడవుగా ఉన్నాయని వారు వెల్లడించారు. దీంతో... ఆమె గిన్నీస్ బుక్ లో ఒక పేజీ సంపాదించుకున్నారు.


ఈ సందర్భంగా స్పందించిన డయానా ఆర్మ్ స్ట్రాంగ్... 1997లో తన పెద్ద కుమార్తె లతీషా మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే... లతీషాకు పొడవైన గోళ్లంటే ఇష్టమని.. అందుకే అప్పటినుంచి తన కూతురి గుర్తుగా గోళ్లు పెంచుతున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో అవి అందంగా కనిపించేందుకు వివిధ రంగులతో తరచూ పెయింట్‌ చేసుకుంటానని తెలిపారు.


ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ రికార్డు సాధించడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పోస్టును గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తన అధికారిక ఎక్స్‌, ఇన్ స్టాగ్రాం ఖాతాలలో పోస్టు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి!

Tags:    

Similar News