మంచుఖండాన్నే గజగజలాడిస్తున్న డొనాల్డ్ ట్రంప్

ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతోంది.. ఆఖరికి కుక్కలతో లాగే డాగ్‌ స్లెడ్‌ టీమ్ లనూ సిద్ధం చేసుకుంటోంది.

Update: 2024-12-25 10:30 GMT

సాధారణంగా మంచుకు ప్రజలు వణుకుతారు. కానీ, ఆ మంచునే భయపెడుతున్నారు అమెరికా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన దెబ్బకు ఆ దేశం తమ భద్రతను సరిచూసుకుంటోంది. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతోంది.. ఆఖరికి కుక్కలతో లాగే డాగ్‌ స్లెడ్‌ టీమ్ లనూ సిద్ధం చేసుకుంటోంది.

ఏమిటీ గ్రీన్ ల్యాండ్..?

గ్రీన్ ల్యాండ్.. ఒక స్వతంత్ర దేశమా? లేక డెన్మార్క్ లో భాగమా? అసలు ఎక్కుడుందీ గ్రీన్ ల్యాండ్..? దీని ప్రత్యేకత ఏమిటి? ట్రంప్ ఎందుకు అంత ఫోకస్ పెట్టారు..? ఔను.. గ్రీన్ ల్యాండ్ అంత ప్రత్యేకమైనదే.. ప్రపంచంలోని 13శాతం చమురు ఇక్కడే ఉంది. ఇంకా గుర్తించని 30 శాతం గ్యాస్‌ నిల్వలున్నట్లు చెబుతున్న ఆర్కిటిక్‌ లో ఇది భాగం. అయితే, గ్రీన్ ల్యాండ్ చాలా పెద్ద దేశం. దీని వైశాల్యం 21 లక్షల చదరపు కిలోమీటర్లు. అయితే, జనాభా 56,500 మాత్రమే. పైగా 75 శాతం భూభాగం ఎప్పుడూ మంచులోనే ఉంటుంది. అసలే రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ట్రంప్ చూపు ఈ గ్రీన్ ల్యాండ్ పై పడిందట. ఇక్కడ రియల్ ఎస్టేట్‌ వెంచర్లు వేయాలని భావించారట.

దీంతోనే డెన్మార్క్‌ అప్రమత్తమైంది. మరి గ్రీన్ ల్యాండ్ గురించి డెన్మార్క్ కు ఏంటి సంబంధం? అంటే.. గ్రీన్ ల్యాండ్ డెన్మార్క్ దే. ఆ దేశంలో భాగమైనా గ్రీన్ ల్యాండ్ కు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. దీంతోనే గ్రీన్ ల్యాండ్ పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ‘మేం విక్రయానికి లేం’ అని గ్రీన్‌ ల్యాండ్‌ ప్రధాని మ్యూట్‌ ఎజేడ్‌ స్పందించారు. డెన్మార్క్ రక్షణ మంత్రి ట్రాల్స్‌ ఎల్‌ పౌల్సన్‌ మాట్లాడుతూ గ్రీన్ ల్యాండ్ రక్షణ బడ్జెట్‌ ను రెండంకెల బిలియన్‌ డాలర్లకు పెంచుతామన్నారు. వాస్తవానికి డెన్మార్క్.. అమెరికాకు మిత్రదేశమే. కాగా, గ్రీన్ ల్యాండ్ లో అమెరికాకు భారీ అంతరిక్ష కేంద్రం ఉంది. దీనిని ఫస్ట్ ఎయిర్ బేస్ అని కూడా అంటారు. ఉత్తర అమెరికా ఖండం నుంచి ఐరోపాకు వెళ్లే షార్ట్‌ కట్‌ మార్గం గ్రీన్‌ ల్యాండ్‌ సమీపంలో ఉంది.

అపార ఖనిజ సంపద

గ్రీన్ ల్యాండ్ ఒక ద్వీపం. ఇక్కడ అత్యధిక ఖనిజ సంపద ఉంది. దీన్ని కలిపేసుకోవాలని 1860ల్లోనే అప్పటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ ఆలోచన చేశారు. 2016లో అధ్యక్షుడైన ట్రంప్‌.. పదవి నుంచి దిగిపోయే ముందు 2019లో గ్రీన్‌ ల్యాండ్‌ ను కొనుగోలు చేస్తానని డెన్మార్క్‌ ను కోరగా ఆ దేశం తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో డెన్మార్క్ పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నారు.

భద్రత కట్టుదిట్టం

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో డెన్మార్క్ ఉలిక్కిపడుతోంది. గ్రీన్ ల్యాండ్ కు వచ్చే నౌకల తనిఖీ, దీర్ఘశ్రేణి డ్రోన్ల ను సమకూర్చుకోవడం, మరో రెండు డాగ్‌ స్లెడ్‌ బృందాలను ఏర్పాటుచేయడం చేపడుతోంది. నుక్‌ లోని ఆర్కిటిక్‌ కమాండ్‌ లో సిబ్బందిని పెంచుతోంది. ఎఫ్‌-35 సూపర్‌ సోనిక్‌ విమానాలను మోహరించేలా గ్రీన్‌ ల్యాండ్ లోని మూడు పౌర విమానాశ్రయాలను అప్‌ గ్రేడ్‌ చేయనుంది.

Tags:    

Similar News