ఎంత సేపు చేశామన్నది కాదు.. ఏం చేశామన్నదే ముఖ్యమన్న అంబానీ

ఈ అంశంపై తాజాగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ స్పందించారు.;

Update: 2025-03-01 13:30 GMT

ఉద్యోగుల పని గంటల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత ముదిరింపజేశాయి. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి కొద్ది నెలల క్రితం భారతదేశ యువత వారానికి 70 గంటలు తప్పనిసరిగా పనిచేయాలని సూచించడం సంచలనంగా మారింది. ఆయన అభిప్రాయాన్ని కొందరు సమర్థించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.

- ఎల్ అండ్ టీ చైర్మన్ 90 గంటల పని సూచన

ఈ నేపథ్యంలో, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎస్ సుబ్రహ్మణ్యన్ మరింత ముందుకు వెళ్లి, ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేపింది. ఇది వాస్తవానికి సాధ్యమా? ఇది ఉద్యోగుల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి.

-క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అభిప్రాయం

క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్ యార్ది ఈ అంశంపై స్పందిస్తూ రోజుకు 9.30 గంటల చొప్పున వారానికి ఐదు రోజులు పనిచేయడం సరిపోతుందని తెలిపారు. అంతేకాదు, ఉద్యోగులకు వీకెండ్స్‌లో ఈ-మెయిల్స్ పంపరాదని కంపెనీలకు సూచించారు. తాను ఈ విధానాన్ని గత నాలుగేళ్లుగా పాటిస్తున్నానని అన్నారు.

-ఆకాశ్ అంబానీ విభిన్న దృక్పథం

ఈ అంశంపై తాజాగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ స్పందించారు. ముంబయి టెక్ వీక్ ఈవెంట్‌లో మాట్లాడుతూ "ఒక ఉద్యోగి ఆఫీసులో పనిచేసే గంటల సంఖ్య నాకు ముఖ్యం కాదు, ఆయన పని నాణ్యతే ముఖ్యం," అని పేర్కొన్నారు. పని, కుటుంబం తనకు అత్యంత ప్రాధాన్యతలు అని, ప్రతి ఉద్యోగి తమ జీవితంలోని ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని ఆయన సూచించారు.

ఈ వివాదం నేపథ్యంలో ఉద్యోగుల పని గంటలపై స్పష్టమైన విధానం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పనిగంటల పెంపు ద్వారా ఉత్పాదకత పెరుగుతుందా? లేక దీని ప్రభావం ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం ఇంకా అన్వేషించాల్సినదే. అయితే పని నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాశ్ అంబానీ చెప్పిన అభిప్రాయం నూతన దిశగా మారొచ్చు.

Tags:    

Similar News