అదే తీరు.. వెనక్కి తగ్గని ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు

సస్పెన్షన్ పై ఆయన నేరుగా కామెంట్లు చేయకపోయినా, మల్లన్నకు చెందిన యూట్యూబ్ మీడియా ఓ పాత వీడియో రిలీజ్ చేసింది.

Update: 2025-03-01 12:28 GMT

కాంగ్రెస్ నుంచి తనను సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పరోక్షంగా స్పందించారు. సస్పెన్షన్ పై ఆయన నేరుగా కామెంట్లు చేయకపోయినా, మల్లన్నకు చెందిన యూట్యూబ్ మీడియా ఓ పాత వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోనే మల్లన్న స్పందనగా భావిస్తుండటంతో వైరల్ అవుతోంది.

కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడగానే ఎమ్మెల్సీ మల్లన్న గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయనకు చెందిన యూట్యూబ్ చానల్ లో ఏం పీక్కుంటారో.. పీక్కోండి అని మల్లన్న వ్యాఖ్యానించారు. ‘పులి బోనులో నుంచి బయటకు వస్తే ఎట్లా వేటాడుతుందో చూపిస్తారు’ అని ఆ వీడియోకు ట్యాగ్ లైన్ తగిలించారు. రాష్ట్రంలోని ఓ సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా భావించే కులగణనపైనా వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఎమ్మెల్సీకి గత నెల 5న కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 12లోగా సమాధానం చెప్పాలని అప్పట్లో సూచించింది. అయితే నోటీసులు అందుకోగానే తాను నోటీసులకు రిప్లై ఇవ్వనని మల్లన్న తేల్చిచెప్పారు.

ఇక సస్పెన్షన్ వేటు పడగానే తనకు కాంగ్రెస్ తో అవసరం లేదన్నట్లు ఆయన పాత వీడియోను విడుదల చేశారు. వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన తీన్మార్ మల్లన్న చాలా కాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నారు. గతంలో ఓ సారి స్వతంత్రంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి గెలిచారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడిన ఆయనపై పలుమార్లు దాడులు జరిగాయి. తనకు రాజకీయ పార్టీ అండ కావాలని భావించిన తీన్మార్ మల్లన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలలో ఆయన ఇమడలేని పరిస్థితులు ఏర్పడటంతో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.

కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ వేటు పడటంతో తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏ పార్టీలో చేరినా ఓ సామాజికవర్గం నేతలు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో ఆయనే స్వయంగా ఓ పార్టీని స్థాపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీసీ ఉద్యమానికి తెరలేపి బీసీ నేతగా ఎదగాలని మల్లన్న ఆలోచనగా చెబుతున్నారు. రాష్ట్రంలో 50 శాతం కన్నా ఎక్కువ జనాభా ఉన్న బీసీల ప్రతినిధిగా బీసీల హక్కుల కోసం పోరాడుతానంటూ ఆయన ఇటీవల ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ ప్రకారమే బీసీ సదస్సులో ఓ ప్రధాన సామాజికవర్గాన్ని కించపరిచేలా మాట్లాడరనే విమర్శలు ఎదుర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ చివరి రెడ్డి సీఎం అంటూ వ్యాఖ్యానించి అగ్గిరాజేశారు. ఈ పరిస్థితుల్లో మల్లన్న భవిష్యత్ అడుగులు ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News