పీవీ ఇవ్వని తెలంగాణను సోనియానే కదా ఇచ్చింది కేటీఆర్?
దీనిపై కౌంటర్ ఇచ్చే క్రమంలో మాజీమంత్రి కేటీఆర్ నోటి నుంచి ఆణిముత్యాల్లాంటి మాటలుకొన్ని వచ్చాయి.
నోటికి వచ్చినట్లు మాట్లాడటం కొందరికి కుదురుతుంది. కానీ.. కీలక స్థానాల్లో ఉన్న వారు నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం బాగానే ఉన్నా.. తర్వాతి కాలంలో వారు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పడుతుంది. అందుకే.. కీలకస్థానాల్లో ఉన్న వారు తమ నాలుకను ఎటు పడితే అటు తిప్పటానికి వీల్లేదు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడిన కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ మీదా.. కాంగ్రెస్ అధినాయకత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడటం కనిపిస్తుంది.
కేటీఆర్ ను ఎన్ఆర్ఐ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ మండిపడ్డారు. దీనిపై కౌంటర్ ఇచ్చే క్రమంలో మాజీమంత్రి కేటీఆర్ నోటి నుంచి ఆణిముత్యాల్లాంటి మాటలుకొన్ని వచ్చాయి. అందులో ముఖ్యమైనది.. సోనియాగాంధీ విదేశీ మహిళ అని. ఒకే.. అది నిజం కూడా.భారత్ కు తిరిగి వచ్చేసిన కొన్నిదశాబ్దాల తర్వాత.. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా అధినేత్రిగా వ్యవహరించటమే కాదు.. యూపీఏ1.. యూపీఏ2లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆమెను.. ఈ రోజుకు విదేశీ మహిళగా అభివర్ణించటం చూస్తే కేటీఆర్ దివాళా కోరుతనం కనిపిస్తుందన్నవిమర్శ బలంగా వినిపిస్తోంది.
దేశీయ ప్రధానమంత్రులు ఎంతమంది ఇప్పటికి దేశాన్ని ఏలారు? అన్న ప్రశ్నకు సమాధానం కోసం పెద్దగా వెతకాల్సిన అవసరం ఉంది. కానీ.. వారెవరూ చేయలేనిన పనిని కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ మాత్రం పట్టుపట్టి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిని వైనాన్ని మర్చిపోలేం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాల్లో ఆ రాష్ట్రం పచ్చగా.. సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అంతేకాదు.. ఆ రోజుల్లో సోనియా నివాసానికి కేసీఆర్ అండ్ కుటుంబ సభ్యులు వెళ్లి రావటం .. కాంగ్రెస్ అధినేత్రాలు థ్యాంక్స్ చెప్పటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను దేవతగా అభివర్ణించారు నాటి ముఖ్యమంత్రి.
మిగిలిన రంగాలకు రాజకీయ రంగానికి మధ్య తేడా ఒకటుంది. ఒకసారి పొగిడేసిన ప్రముఖుల్ని.. తర్వాతి కాలంలో నోటికి వచ్చినట్లుగా తిట్టేయటం.. అనరాని మాటల్నిఅనేసే విషయంలో ముందు వెనుకా చూసుకోకుండా మాట్లాడేయటం రాజకీయాల్లో కనిపిస్తుంది. అప్పటివరకు దేవత అన్న వారిని దెయ్యం అనే సామర్థ్యం రాజకీయ నేతలకు మాత్రమే ఉంటుంది. తన తండ్రిని చంద్రశేఖర్ రావుగారు అనలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్.. దేశ ప్రధానమంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు ఈ గౌరవ మర్యాదలు ఏమైపోయాయి. వయసులో తనకంటే రెండు.. ముప్ఫై ఏళ్లు పెద్ద వాళ్లైన రాజకీయ ప్రత్యర్థుల్ని ఏకవచనంతో పిలిచినప్పుడు కేటీఆర్ ప్రస్తావించే గౌరవ మర్యాదలు ఎక్కడికి వెళతాయి? అన్నది ప్రశ్న.
సోనియాగాంధీ ఎన్ఆర్ఐ అయినప్పుడు.. ఆమె విదేశీ మూలాలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న వేళలో ఏమైనట్లు? తెలంగాణ ఇచ్చేస్తే.. కాంగ్రెస్ పార్టీలో తమ ఉద్యమ పార్టీని విలీనం చేస్తానన్నప్పుడు విదేశీ మూలాలు ఎందకు గుర్తుకు రానట్లు? నచ్చనప్పుడు.. తమ చేతిలో ఉన్న అధికారం చేజారిన వేళలో అవలక్షణాల్ని ప్రస్తావించే కేటీఆర్ గతాన్ని మర్చిపోవచ్చు కానీ.. ప్రజలు.. చరిత్ర మర్చిపోదు కదా? ఆ విషయాన్నిఆయన ఎందుకు మర్చిపోతున్నట్లు?