పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా ?
రెండు దఫాలు పూర్తి మెజారిటీతో బీజేపీని ప్రజలు గెలిపించారు. దేశంలో కాంగ్రెసేతర ప్రధానులలో అత్యధిక కాలం పాలించిన రికార్డుని ఈ విధంగా మోడీ సొంతం చేసుకున్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ 2014 మే నెల మధ్యలో అధికారం చేపట్టారు. సరిగ్గా పదేళ్ళు పూర్తి అయింది ఆయన పీఎం కుర్చీలో కూర్చుని. రెండు దఫాలు పూర్తి మెజారిటీతో బీజేపీని ప్రజలు గెలిపించారు. దేశంలో కాంగ్రెసేతర ప్రధానులలో అత్యధిక కాలం పాలించిన రికార్డుని ఈ విధంగా మోడీ సొంతం చేసుకున్నారు.
ఇక పదేళ్ళలో మోడీ పాలన ఎలా సాగింది. ఆయనకు ప్లస్ ఏమిటి మైనస్ ఏమిటి, మోడీ తన మార్క్ పాలన చూపించి ప్రజల మెప్పు పొందారా లేక ఆదరణ తగ్గించుకున్నారా ఇత్యాది ప్రశ్నలు సహజంగానే వస్తాయి. మోడీ పాలనలో ఫెయిల్ అయ్యారా అయితే ఏఏ అంశాలలో అన్న చర్చ కూడా నడుస్తోంది. లేదు ఆయన పాస్ అయ్యారు అనుకుంటే ఏ విషయాల్లో అన్నది కూడా చూడాల్సి ఉంది.
ఎందుకంటే ఇది కీలకమైన సమయం. ఒక దశాబ్దం కాలం అంటే చిన్న విషయం అయితే కాదు, దేశం ప్రగతి గతిని నిర్ణయించడానికి అవసరం అయిన కాలంగానే దీనిని అంతా చూస్తారు. ఇక మోడీ విషయంలో కూడా ఈ తరహా విశ్లేషణలు అయితే వస్తున్నాయి. నిజం చెప్పాలి అంటే రాజకీయాల్లో ఏ నేత కూడా తాను ఫెయిల్ అని అసలు ఒప్పుకోరు. పాస్ అయ్యామనే చెబుతారు.
ఇక ఒకసారి అధికారంలోకి వచ్చి అయిదేళ్ళు పాలిచ్నిన మీదట ప్రజలు దీవించి మరోసారి అధికారం ఇస్తే ఆయన పాస్ అయినట్లే. అదే సమయంలో మోడీ రెండు సార్లు అధికారం అందుకున్నారు. ఇపుడు మూడోసారి అధికారం కోరుకుంటున్నారు. అయితే మూడవసారి అధికారంలోకి రావాలని మోడీ చేస్తున్న ప్రయత్నం మాత్రం జనాదరణకు కాసింత దూరంగానే ఉంది అని అంటున్నారు.
మోడీ విన్నపాలకు జనాల నుంచి సరిగ్గా స్పందన రావడం లేదు అని అంటున్నారు. ఇక మోడీని మూడవసారి గెలిపించాలీ అంటే ప్రజలకు ఆయన పదేళ్ల కాలంలో ఏమి చేశారు అన్నది కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నారు. పదేళ్లలో మోడీ దేశానికి చేసింది చూస్తే నిఖార్సుగా ఉన్నది అయోధ్యలో రామమందిరం నిర్మాణం. అలాగే 370 అర్టికల్ రద్దు, సీఏఏ, ట్రిపుల్ తలాఖ్ తప్పించి ఏమీ చెప్పుకోవడానికి లేదా అన్న చర్చ కూడా సాగుతోంది.
నిజానికి ఒక దేశాన్ని పదేళ్ల పాటు పాలించిన తరువాత ప్రధాని తన ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవడానికి అనేక అంశాలు ఉంటాయి. కానీ మోడీ ప్రసంగాలు చూస్తే ఎక్కువగా ఇవే అంశాలు కనిపిస్తున్నాయి అన్నది ఒక విశ్లేషణగా ఉంది.
ఇక మరో ముఖ్య విషయం కూడా మోడీ ప్రసంగాల్లో ఉంది. దేశంలో ఎనభై కోట్ల మందికి రేషన్ ఇస్తున్నామని ఆయన అంటున్నారు. అంటే దేశంలో ఇంకా పేదరికం అలాగే ఉంది కదా అన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రపంచంలో భారత్ స్థానం ముందంజలో ఉంది అని బీజేపీ పెద్దలు చెబుతూ ఉంటారు.
అంతే కాదు అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తోందని, అయిదవ ఆర్ధిక వ్యవస్థగా మారిపోతోందని కూడా బీజేపీ పెద్దలు ఊదరగొడుతూ వచ్చారు. అలాంటి దేశంలో ఇంకా ఎనభై కోట్ల మంది పేదలు ఉన్నారు అంటే తలసరి ఆదాయం పెరగలేదు కదా అన్నది నిష్టూరంగా వినిపిస్తున్న నిజం. ఇదే విషయాన్ని ఆర్ధిక నిపుణులు కూడా ఎత్తి చూపిస్తున్నారు.
ఇక దేశాన్ని నిరుద్యోగ భూతం పట్టి పీడిస్తోంది. అలాగే ద్రవ్యోల్బణం రేటు తార స్థాయిలో ఉంది. గ్యారంటీలు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు అన్న చర్చ కూడా ఉంది. ఇక గత పదేళ్లలో చూస్తే దక్షిణాదిన వస్తున్న ఆదాయనని ఉత్తర భారతానికి దోచి పెడుతున్నారు అన్నది అతి పెద్ద ఫిర్యాదు గా ఉంది.
పన్నులు మేము కడితే తిరిగి రావాల్సిన వాట రాకపోగా దేశంలో బీజేపీ ఏలికలు తమ రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు నచ్చిన రాష్ట్రాలకు ప్రధానంగా ఉత్తరాదికి ఎక్కువగా నిధులు ఇస్తున్నారు అని అంటున్నారు. తమిళనాడులో స్టాలిన్ అయినా తెలంగాణాలో రేవంత్ అయినా కర్నాటకలో సిద్ధరామయ్య అయినా కేరళ సీఎం అయినా ఇదే తీరున బీజేపీని నిలదీస్తున్నారు. అయినా వారి నుంచి సరైన సమాధానం అయితే రావడం లేదు
ఇక 2014లో గుజరాత్ మోడల్ అని తెగ ప్రచారం చేసుకున్న బీజేపీ పెద్దలు ఈసారి మాత్రం ఆ ఊసే తలవడం లేదు. గుజరాత్ మోడల్ అన్నది వారికి ఎందుకో అంతగా కలిసి రాదేమో అన్న డౌట్లు ఉన్నాయా అన్నది కూడా అంతా మాట్లాడుకుంటున్న విషయంగా ఉంది. అలాగే అభివృద్ధి అజెండాను ముందు పెట్టి ఓట్లు అడగడం లేదు. మేము పదేళ్లలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని చూపించామని కాబట్టి మరోసారి ఎన్నుకోవాలని కూడా అనడం లేదు.
ఇక బీజేపీ పెద్దల ప్రసంగాలు చూస్తే ఎపుడూ కూడా నవాబులు, సుల్తానులు, టిప్పు సుల్తానులు, ముస్లిమ్స్ ఇదే గోలతో సాగుతోంది అని కూడా విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇదే విషయం మీద మేధావులు సైతం బీజేపీని కార్నర్ చేస్తున్నారు. ఇక పోలిటికల్ గా చూస్తే రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఎక్కువ అయ్యాయని అంటున్నారు. ఈడీ సీబీఐలతో దాడులు చేయించడం తమ ప్రత్యర్ధులను అరెస్ట్ చేయడం అన్నది బీజేపీ జమానాలో ఎక్కువ అయింది అని అంటున్నారు.
ఎవరైనా తమ కూటమి వైపు వస్తే ఓకే. వారి మీద కేసులు ఉండవు, కానీ ప్రత్యర్ధులుగా ఉంటే మాత్రం వెతికి వెంటాడి కేసులు పెట్టే తీరుని కూడా సగటు జనాలు గమనిస్తున్నారు. మొత్తం మీద చూస్తే నెహ్రూ జమానా నుంచి చూస్తే ప్రతీ ప్రధాని ఏలుబడిలో ఎంతో కొంత డెవలప్మెంట్ అయితే దేశం చూసింది మోడీ పదేళ్ల పాలనలో బీజేపీ తమ సొంత అజెండాని పూర్తి చేస్తున్నారు తప్ప కోట్లాది ప్రజలకు ఏమి చేశారు అన్న అతి పెద్ద ప్రశ్న అయితే అందరిలో ఉంది. ఈ ప్రశ్నకు బీజేపీ సంతృప్తికరమైన జవాబు ఇచ్చే తీరుని బట్టే ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అన్నది ఆధారపడి ఉంటుంది.