సినీ పెద్దాయన కల : పవన్ సీఎంగా లోకేష్ డిప్యూటీ సీఎంగా !
తనకు ఒక కల వచ్చిందని ఆ కలలో పవన్ కళ్యాణ్ సీఎం గా నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా అయినట్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కలలు అందరూ కంటారు. అందులో చాలా వరకూ తమ గురించే ఉంటాయి. కానీ సినీ పెద్దాయనగా ఉన్న దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు నిన్న రాత్రి ఒక కల వచ్చిందట. ఆయన కలలో ఏపీ రాజకీయాల గురించిన విషయాలు రావడమే విశేషం. ఆ సంగతిని ఆయన వీడియో బైట్ ద్వారా మీడియాతో పంచుకున్నారు. తనకు ఒక కల వచ్చిందని ఆ కలలో పవన్ కళ్యాణ్ సీఎం గా నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా అయినట్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇద్దరూ రాష్ట్రాన్ని సక్సెస్ ఫుల్ గా పాలిస్తున్నట్లుగా తనకు అనిపించిందని ఈ లోగా కల చెదరి మెలకువ వచ్చిందని తమ్మారెడ్డి అన్నారు. ఈ కల నిజమైతే బాగుంటుందని ఆయన చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలని చాలా మంది అనుకుంటున్నారని ముఖ్యంగా ఆయన అభిమానులు ఇదే ఆశ పడుతున్నారని అన్నారు. ఇక నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని కూడా అనేక డిమాండ్లు వస్తున్నాయని ఆయన చెబుతూ తన కల నిజం అయితే మాత్రం ఈ రెండు కోరికలూ తీరిపోతాయని అన్నారు.
ఇక ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి చంద్రబాబు తప్పుకుని కూటమికి చైర్మన్ హోదాలో ఉంటూ ఈ ఇద్దరికీ ఇలా కీలక పదవులు ఇచ్చారని తమ్మారెడ్డి తన కల గురించి వివరించారు. అంతే కాదు చాలాకాలంగా చంద్రబాబు తాను కనుక లేకపోతే ఏపీ ఏమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తపన ఆశ అన్నీ తాను లేకపోతే టీడీపీ ఏమవుతుంది అన్నదే అని అన్నారు. రాష్ట్రం ఏమవుతుందని కూడా బాబు ఆవేదన ఉందని తమ్మారెడ్డి చెప్పారు.
అయితే ఏపీలో ఇద్దరు నాయకులు ఉద్భవించారు అని వారే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అని అన్నారు. ఈ ఇద్దరు నాయకులూ ఏపీని అద్భుతంగా పాలిస్తారని తాను నమ్ముతున్నాను అని తమ్మారెడ్డి కొసమెరుపు మెరిపించారు. ఇదిలా ఉంటే తమ్మారెడ్డి కన్న కల నెరవేరుతుందా అన్నదే ఇక్కడ చర్చ.
నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో అని అంటున్నారు. అలాగే ప్రచారం కూడా సాగుతోంది. ఆ మీదట బాబు తర్వాత లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతారని కావాలన్నదే తమ్ముళ్ళ మాటగా ఉంది. ఇటీవల మంత్రి టీజీ భరత్ వ్యక్తం చేసిన అభిప్రాయాలూ అలాగే ఉన్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నది జనసేన నేతల కోరిక అన్నది తెలిసిందే. టీడీపీ ఈ తరహా కూర్పు చేసి పవన్ ని సీఎం గా చేస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. కానీ టీడీపీ అలా ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపుచ్చుకుంటుందా అన్నదే కదా అసలు చర్చ అంటున్నారు. దేశంలో ఎక్కడైనా పెద్ద పార్టీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుంది అదే రాజకీయ విధానం అని కూడా అంటారు.
ఆ లెక్కన టీడీపీ కూటమిలో పెద్దన్నగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అన్నది జరిగే పనేనా అన్నది కూడా ఒక కీలకమైన ఆసక్తికరమైన చర్చ. అయితే ఇది అంతా రాజకీయాల మీద అసక్తితో ఎపుడూ తనదైన వ్యాఖ్యానం చేసే తమ్మారెడ్డి భరద్వాజ్ కన్న కల. ఆ కల నిజం అవుతుందా లేదా అంటే చూడాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో దేనినీ కొట్టిపారేయడానికి లేదు. అదే సమయంలో అనుకున్నవి కలలు కన్నవి జరిగేందుకు కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో తమ్మారెడ్డి కల ఇపుడు అతి పెద్ద చర్చగా మారినా మారవచ్చు అంటున్నారు.