ఏపీ నేతల మొద్దు నిద్ర.. రాష్ట్రం పట్టదా!
కానీ, దీనికి విభజన చట్టంలో కేవలం 10 సంవత్సరాలు కేటాయించారు.. అప్పట్లో పదేళ్లంటేచాలా ఎక్కువగానే అనిపించినా.. కాలం గిర్రున తిరిగిపోయింది.
ఏపీ నేతలు మొద్దు నిద్ర పోతున్నారా? లేక... మొద్దు నిద్ర నటిస్తున్నారా? ఇదీ.. ఇప్పుడు ఏపీ సమాజం లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. జూన్ 2 తో ఏపీకి ఉన్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాల పరిమి తి అయిపోతుంది. 2014 లో రాష్ట్ర విభజన నాటి నుంచి కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. కానీ, దీనికి విభజన చట్టంలో కేవలం 10 సంవత్సరాలు కేటాయించారు.. అప్పట్లో పదేళ్లంటేచాలా ఎక్కువగానే అనిపించినా.. కాలం గిర్రున తిరిగిపోయింది.
దీంతో ఇప్పుడు కళ్లముందే ఉన్న హైదరాబాద్‌ను `మీది కాదు` - అనే పరిస్థితి రావడంతో ఏపీ ప్రజలు.. ముఖ్యంగా హైదరాబాద్‌తో అనుబంధం ఉన్న ప్రజలు ఘొల్లు మంటున్నారు. పోనీ.. ఏపీకి ఏమైనా రాజ ధాని ఉందా? అంటే అది కూడా లేదు. గతంలో చంద్రబాబుకట్టిన రాజధానిని జగన్ నిర్వీర్యం చేశారన్న కోపం ఉంది. కానీ.. ఇప్పుడు దీనిపై ఎంత వగచి ఏం లాభం? అని కళ్లొత్తుకుంటున్నారు. అయితే.. ఇప్పు డున్న అవకాశం(?) సదరు హైదరాబాద్‌ను మరో ఐదేళ్లు కొనసాగించడమే.
దీనిపై కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తి డి తెచ్చి.. ఏదో ఒక రకంగా.. తెలంగాణకు, ఏపీకిమధ్య హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. దీనికి సంబంధించి ఒకవైపు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ప్రధాన మీడియా కూడా.. కథనాలు రాస్తోంది. కానీ, అడగాల్సిన నాయకులు.. స్పందించాల్సిన నాయకులు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా .. స్పందించ లేదు. అధికారంలో ఉన్న జగన్ కానీ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్‌లు కానీ.. బీజేపీ కానీ.. ఒక్కరంటే ఒక్కరూ పన్నెత్తు మాట అనలేదు.
కానీ, ప్రజల్లో మాత్రం ఇప్పుడు వేడిఅయితే ఉంది. ఇది ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. ఇప్పటికైతే.. నాయకులు రియాక్ట్ అవ్వాలని.. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో ఐదేళ్లు కొనసాగించాలని కోరాలని.. వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ, కామ్రెడ్లు సహా.. ఏ ఒక్కరూ స్పందించలేదు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం రియక్ట్ అయ్యారు. నాయకులు ఎవరూ స్పందించలేదని, తాను ఊహించిందే జరిగిందని.. అందరూ రాజకీయాల్లో మునిగిపోయి..ఎగ్జిట్ పోల్స్‌లోనే ఉండిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎందుకు స్పందించలేదు?
+ సీఎం జగన్ విషయాన్ని తీసుకుంటే.. ఆయన ఎన్నికల ప్రచారంలోనే చెప్పేశాను. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని.. దానినే రాజధానిగా ప్రకటిస్తానని అన్నారు. అంటే.. జగన్ దృష్టిలో రాజధానిగా విశాఖ ఉంది. ఇక, ఆయనకు హైదరాబాద్‌ను అడగాల్సిన అవసరం లేదు.
+ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా.. తాము అధికారంలోకి రాగానే అమరావతిని పునః ప్రారంభిస్తామని చెప్పారు. మూడు మాసాల్లోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. సో.. ఈయనకు కూడా.. రాజధానిపై క్లారిటీ ఉంది. దీంతో చంద్రబాబు కూడా.. హైదరాబాద్‌పై ఒత్తిడి చేయలేదు. పైగా...తెలంగాణలో పార్టీని విస్తరించాలని నిర్ణయించుకున్న దరిమిలా. హైదరాబాద్‌ను మరోసారి ఉమ్మడిగా అడిగితే . అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇరువురు నేతలు కూడా.. మౌనంగా ఉన్నారు.