ఓటుకు నోటు పనిచేస్తుందా!
దాదాపు ఒకటిన్నర రోజు అభ్యర్ధులందరు ఎక్కువగా ప్రలోభాలపైనే దృష్టిపెట్టారన్నది వాస్తవం.
ప్రచార పర్వం అయిపోయి ఓటర్లు తీర్పుచెప్పటం మొదలైపోయింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు జనాలు ఓట్లు వేసి తమ తీర్పును చెప్పబోతున్నారు. 28వ తేది సాయంత్రం వరకు చేసిన ప్రచారం ఒకఎత్తయితే తర్వాత అంటే 30వ తేదీ తెల్లవారు జాము వరకు చేసుకున్న ప్రయత్నాలు మరోఎత్తు. దాదాపు ఒకటిన్నర రోజు అభ్యర్ధులందరు ఎక్కువగా ప్రలోభాలపైనే దృష్టిపెట్టారన్నది వాస్తవం. ఈ ప్రలోబాలకు ఈ పార్టీ ఆ పార్టీ ఈ అభ్యర్ధి, ఆ అభ్యర్ధి అన్న తేడా లేదు.
వీలున్న పార్టీలన్నీ, అభ్యర్ధుల్లో అత్యధికులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటానికి బాగానే ప్రయత్నించారు. ఈ ప్రలోభాల్లో కీలకమైనది డబ్బు. దీన్ని ఓటుకు నోటు అని కూడా అంటారు. ఓటుకు ఇంతాని రేటు కట్టి వీలుంటే విడివిడిగాను లేకపోతే టోకుగాను కొనేసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఇందులో దాపరికం ఏమీలేదు అంతా బాహాటంగానే జరిగింది. కాంగ్రెస్, బీజేపీలు తమకున్న అవకాశాల మేరకు ఓటుకు ఇంతాని రేటు కట్టాయి. అధికారంలో ఉంది కాబట్టి ఈ రెండుపార్టీలకన్నా ఎక్కువగానే రేటు కట్టిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు తక్కువలో తక్కువ రు. 6 వేలు కూడా బీఆర్ఎస్ అభ్యర్ధులు పంపిణీ చేసినట్లు వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ అభ్యర్ధులు ఓటుకు మూడు వేల రూపాయలు పంచిన చోట బీఆర్ఎస్ అభ్యర్ధులు 6 వేల రూపాయలు పంచారట. ఓట్ల కొనుగోలు ఈ విధంగా ఒక నియోజకవర్గంలో జరిగితే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇలాగే జరిగుంటుందనటంలో సందేహంలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పోల్చితే బీజేపీ, ఇతర పార్టీలు ఓట్ల కొనుగోలు చేసింది తక్కువనే చెప్పాలి.
పైగా ఓట్లకొనుగోలులో కూడా అందరు ఓటర్లు డబ్బులు తీసుకోరు. కొద్ది సెక్షన్లు మాత్రమే తీసుకుంటాయి. ఈ సెక్షన్ల ఓట్ల కొనుగోలుకే పార్టీలు లేదా అభ్యర్ధులు కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టక తప్పటంలేదు. కొందరు డైరెక్టుగా డబ్బులే తీసుకుంటుంటే మరికొందరు ప్రెషర్ కుక్కర్లు, లిక్కర్ బాటిళ్ళు, ఖరీదైన బట్టలు, వాచీలు లాంటి రూపాల్లో తీసుకున్నారట. రూపం ఏదైనా కానీ ఓటుకు నోటు పనిచేస్తుందా అన్నదే ఇపుడు సస్పెన్సుగా మారింది.