జగన్ అవసరాలు ఉన్నాయా..బీజేపీ తేల్చదు ముంచదు ..
మరి పొత్తులు ఇప్పటి నుంచే కుదుర్చుకుంటే సీట్ల పంచాయతీ తేలితే జనంలోకి వెళ్లేందుకు ఆ పైన విజయాలకు బాట వేసుకునేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
బీజేపీకి ఏపీలో రాజకీయం చేయడం పెద్దగా కష్టంగా అనిపించడంలేదు. ఎందుకంటే అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్యలో జనసేన ఉన్నాయి. అందరూ బంధువులే. దాంతో ఇపుడే తొందర ఏముంది అని కాలం వెళ్ళబుచ్చుతోంది. అయితే ఏపీలో ఎన్నికలు ముంగిటకు వచ్చేశాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఏపీ ఎన్నికలు ఉన్నాయి.
మరి పొత్తులు ఇప్పటి నుంచే కుదుర్చుకుంటే సీట్ల పంచాయతీ తేలితే జనంలోకి వెళ్లేందుకు ఆ పైన విజయాలకు బాట వేసుకునేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కానీ బీజేపీ తేల్చదు ముంచదు. ఈ పరిణామంతో టీడీపీ జనసేన వెయిటింగ్ అంటున్నాయని టాక్.
ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఏపీ బీజేపీతో వైసీపీకి కుస్తీ ఉంది. అదే కేంద్రంలోని బీజేపీతో దోస్తీ ఉంది అని అంటారు. కేంద్రం ప్రవేశపెట్టే అనేక కీలకమైన బిల్లులకు వైసీపీ ఓటేసి మరీ మద్దతు ఇచ్చింది. బీజేపీకి ఇంకా చాలా బిల్లులు అమ్ముల పొదిలో ఉన్నాయని అంటున్నారు. వాటిని ఆమోదించుకునేందుకు ప్రత్యేకించి రాజ్యసభలో వైసీపీ మద్దతు కావాలని అంటున్నారు.
దాంతోనే వైసీపీ మొహమాటాలు అవసరాలతో కేంద్ర బీజేపీ నాయకత్వం ఏపీలో పొత్తుల మీద ఎటూ తేల్చడం లేదు అని అంటున్నారు. అయితే బీజేపీ కూడా ఏదో ఒకటి చెబితే ఏపీలో కూటమి కధను కొత్త మలుపు తిప్పుదామని టీడీపీ చూస్తోంది. ఏపీ బీజేపీ నేతలు అయితే టీడీపీతో పొత్తుకు ఓకే అంటున్నారని టాక్.
ఇక రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసిం హారావు రావు లాంటి వారు ఏపీలో తమంకు కేవలం జనసేనతోనే పొత్తు ఉందని అంటున్నారు. టీడీపీతో పొత్తు అంటే అది తేల్చాల్సింది కేంద్రమే తప్ప తాము కాదనీ అంటున్నారు. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి కూడా అదే అంటున్నారు. ఏపీలో పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం తేలుస్తుంది అని చెబుతోంది.
ఈ నేపధ్యంలో నరేంద్ర మోడీ అమిత్ షా ఏమి చేస్తారు అన్నదే చర్చగా ఉంది. అయితే ఏపీలో టీడీపీతో పొత్తుకు నిజంగా బీజేపీ ఆసక్తిగా ఉందా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే టీడీపీ విషయంలో బీజేపీకి అలాంటి ఆలోచనలు ఉంటే ముందుగా తెలంగాణా ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకుని అలా రూట్ క్లియర్ చేసుకుని వచ్చేది అని అంటున్నారు.
కేవలం జనసేనతోనే పొత్తు పెట్టుకుంది తప్ప చాలా చోట్ల బాగానె ఓట్లు ఉన్న టీడీపీని పక్కన పెట్టేసింది అని అంటున్నారు. ఇక ఏపీలో జనసేనతో కలసి వెళ్లాలని బీజేపీ చూస్తున్నా జనసేన టీడీపీ ఇప్పటికే చెట్టాపట్టాల్ వేశాయి. దాంతో బీజేపీకి రెండే ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు.
చేస్తే ఒంటరిగా పోటీ చేయడం లేకపోతే టీడీపీ కూటమిలో చేరడం. అయితే కేంద్రంలో హ్యాట్రిక్ విజయం మీద ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఏపీ ఎంపీ సీట్లూ అవసరమే. అదే టైం లో వైసీపీ మద్దతూ అవసరమే. ఇలా అవ్వా బువ్వా కావాలన్న ఆలోచనతొనే బీజేపీ నిర్ణయం చెప్పకుండా నానబెడుతోంది అని అంటున్నారు. మరి బీజేపీ ఈ నసుగుడుతో టీడీపీ జనసేన కూటమి అవకాశాలను దెబ్బ తీస్తోందా అన్న చర్చ అయిఏ సాగుతోంది.