మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తున్నాం.. పశ్చిమాసియాపై ట్రంప్ మాట
కానీ, ఇప్పుడు మాత్రం కొన్ని రోజులుగా మూడో ప్రపంచ యుద్ధం మాట గట్టిగా వినిపిస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధం జపాన్ పై అమెరికా భయంకర అణు బాంబు దాడితో ముగిసింది.. అంతే.. ఆ తర్వాత మరెప్పుడూ ప్రపంచ యుద్ధం మాటే వినపడదని భావించారు. ఈ 80 ఏళ్లలో ఒకటి రెండుసార్లు అలాంటి పరిస్థితులు వచ్చినా.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయలేదు. అప్పట్లోని ప్రపంచ నాయకులు కూడా కాస్త చొరవ చూపి పరిస్థితిని చల్లార్చారు. కానీ, ఇప్పుడు మాత్రం కొన్ని రోజులుగా మూడో ప్రపంచ యుద్ధం మాట గట్టిగా వినిపిస్తోంది. రెండు మూడు దేశాల సంఘర్షణ మిగతా ప్రపంచ దేశాల వారిని కలవర పెడుతోంది.
పశ్చిమాసియా పుండుపై కారం
పాలస్తీనా సహా చుట్టూ అరబ్ దేశాలు.. మధ్యలో ఇజ్రాయెల్.. ఇదీ పశ్చిమాసియా పరిస్థితి. ఇప్పటికే నాలుగైదు యుద్ధాలు, పలుసార్లు సంఘర్షణలు.. అయితే, ఇజ్రాయెల్ తన శక్తిసామర్థ్యాలతో అజేయంగా నిలుస్తోంది. ఎప్పుడూ ఉద్రిక్తమే అయినా.. కొన్నేళ్లుగా ఎలాంటి అలజడి లేదు. అయితే, అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లోకి చొరబడి సాగించిన మారణకాండతో పరిస్థితి మారిపోయింది. అప్పటినుంచి ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతూనే ఉంది. హమాస్ కు ఇరాన్ మద్దతు ఉన్న, లెబనాన్ నుంచి పనిచేసే హెజ్బొల్లా తోడైంది. మరోవైపు హమాస్ ను అంతం చేయడం ఎంతకూ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ కు అతిథిగా వెళ్లిన హమాస్ అగ్ర నేత ఇస్మాయిల్ హనియాను తుదముట్టించింది. మరోవైపు లెబనాన్ లో హెజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ ను హతమార్చింది. గత ఏప్రిల్ లో లెబనాన్ రాజధాని బీరుట్ లో ఉన్న ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీపీ)ను చంపింది. దీంతో ఇరాన్-హెజ్బొల్లా-హమాస్ లతో ఇజ్రాయెల్ పోరాడాల్సి వస్తోంది. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడికి దిగింది. హెజ్‌బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. ఈ ఉద్రిక్తతలతో అమెరికా అప్రమత్తమై యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. ఇరాన్, మిలిటెంట్ గ్రూపులు కూడా అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా భగ్గుమంటోంది.
ట్రంప్ నోట ఆ మాట
ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పై దాడి తప్పదని తేల్చిచెప్పింది. అయితే అది ఎప్పుడు, ఎలా అనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్-హెజ్బొల్లా-ఇరాన్ ఘర్షణల్లో రష్యా కూడా పాలుపంచుకోవడం ఖాయం. ఇరాన్ కు మద్దతుగా రష్యా రంగంలోకి దిగుతుంది. తద్వారా ఉక్రెయిన్ లో అమెరికా, బ్రిటన్ తదితర దేశాల ప్రమేయానికి గట్టి జవాబు ఇవ్వాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన.. ఇవి మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతున్నాయని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఏం చేస్తున్నారంటూ అధ్యక్షుడు జో బైడెన్ ను నిలదీశారు.
పశ్చిమాసియాలో మంటలు.. బీచ్ లో బైడెన్
పశ్చిమాసియా నిప్పుల్లో ఉంటే.. బైడెన్ కాలిఫోర్నియా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారని, డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్ర చేస్తున్నారంటూ ట్రంప్ మండిపడ్డారు. హారిస్ గెలిస్తే అమెరికాకు భవిష్యత్తే ఉండదని.. ప్రపంచాన్ని ఆమె అణు యుద్ధం దిశగా తీసుకెళ్తారని ఆరోపించారు. ఆమెను ప్రపంచం ఎప్పుడూ పట్టించుకోదని ధ్వజమెత్తారు. ఇటీవల అధ్యక్ష అభ్యర్థిగా తన నామినేషన్ ను స్వీకరిస్తూ.. ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని కమలా చెప్పారు. అదే సమయంలో గాజాలో ప్రజల పరిస్థితిపైనా ఆందోళన వ్యక్తం చేశారు.