దసరా అంటే ఏమిటి? ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి?
హిందువులకు ముఖ్యమైన పండుగలలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
హిందువులకు ముఖ్యమైన పండుగలలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజశుద్ధ నవమి వరకు 9 రోజులపాటు దేవీ నవరాత్రులు జరుపుకొని పదవ రోజున విజయదశమితో కలిసిన దసరా వస్తుంది. శక్తిని ఆరాధించే వారికి ఇది ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ పండుగలను నవరాత్రులు.. శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు.
దుర్గామాత మహిషాసురుడని రాక్షసుడిని వధించిన రోజున విజయదశమి జరుపుకుంటాము.
మన పురాణాల ప్రకారం విజయదశమి నాడు అర్జునుడు శమీ వృక్షము నుంచి గాండీవాన్ని దింపి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేస్తాడు. ఇదే రోజు రాముడు రావణాసురుని వధిస్తాడు. అధర్మంపై ధర్మం ఎప్పుడు గెలుస్తుంది అనేదానికి నిదర్శనంగా విజయదశమిని జరుపుకుంటాము. సాధారణంగా పండుగలు అంటే మనకు ప్రత్యేకమైన సమయాలు.. తిధి ,నక్షత్రాలు చూసుకోవడం అలవాటే. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం దసరా ఎప్పుడు చేసుకోవాలి.. రావణ దహన కార్యక్రమం ఎప్పుడు నిర్వహించాలి అనే విషయాలను తెలుసుకుందాం..
తెలుగు క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 ఉదయం 108 నిమిషాలకు ఆశ్వయుజ మాసం దశమి తిధి ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 13 ఉదయం 9 గంటల 8 నిమిషాల వరకు కొనసాగుతుంది. అంటే ఈ సంవత్సరం దసరా పండుగను అక్టోబర్ 12 శనివారం నాడు జరుపుకోనున్నారు. ఇక అదే రోజు మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల నుంచి 2 గంటల 49 నిమిషాల వరకు ఆయుధ పూజకు శుభ సమయం. అంటే ఈ సంవత్సరం ఆయుధ పూజ నిర్వహించుకోవడానికి 46 నిమిషాల సమయం లభిస్తుంది.
రావణాసురుడిపై రాముడు విజయాన్ని.. సీతమ్మ కష్టాలు తీరిన శుభ సమయాన్ని.. గుర్తు చేసుకుంటూ జరుపుకునే రావణ దహన కార్యక్రమం అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటల 53 నిమిషాల నుంచి 7 గంటల 27 నిమిషాల మధ్యకాలంలో జరుపుకోవచ్చు. విజయానికి చిహ్నంగా జరుపుకునే విజయదశమి నాడు రావనవధ, జమ్మి ఆకుల పూజ చేయడం చాలామందికి ఆచారం.
మహిషాసురుడు అనే రాక్షసుడిపై తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో యుద్ధం చేసి పదవరోజు అతనిని దుర్గమ్మ వధిస్తుంది. అందుకే ఆమెను మహిషాసుర మర్దినిగా ఆరోజు పూజిస్తాము. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది అవతారాలతో పూజించి.. పదవరోజు ఆమె విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాము. చాలామంది ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.