ఏక్ నాధ్ షిండే కుంపటి పెడుతున్నారా ?

రెండున్నరేళ్ళ క్రితం ఏక్ నాధ్ షిండే అన్న పేరు జాతీయ స్థాయిలో మారు మోగిపోయింది. ఆయన శివసేనలో విధేయ నాయకుడు.

Update: 2025-02-12 03:52 GMT

రెండున్నరేళ్ళ క్రితం ఏక్ నాధ్ షిండే అన్న పేరు జాతీయ స్థాయిలో మారు మోగిపోయింది. ఆయన శివసేనలో విధేయ నాయకుడు. బాల థాక్రే ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత కుమారుడు ఉద్ధవ్ థాక్రే నాయకత్వాన్ని సైతం బలపరచి శివసేనకు దన్నుగా ఉన్న నేత. అటువంటి ఏక్ నాధ్ షిండే ఉద్ధవ్ థాక్రేకు హ్యాండ్ ఇచ్చి బీజేపీ వైపు వచ్చేశారు.

తన దగ్గర ఉన్న ఎమ్మెల్యే బలాన్ని మద్దతుగా ఇచ్చి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. అయితే ఆనాడు ఏక్ నాధ్ షిండే బీజేపీకి దేవుడిలా ఆదుకున్నారు. అందుకే ఆయనకే సీఎం సీటు ఇచ్చేశారు. అది ఏక్ నాధ్ షిండే సైతం ఊహించలేనిది. అయితే తనకు దక్కిన ఉన్నతమైన పదవిని జాగ్రత్తగాన షిండే చేస్తూ తనదైన పాలనతో జనాలలో కొంత మంచి ఇమేజ్ నే సాధించారు.

ఇక 2024లో ఎన్నికలు వచ్చాయి. మహాయుతి పేరిట కూటమి కట్టి బీజేపీ ఏక్ నాధ్ షిండే శివసేన, అలాగే ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ లతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. బంపర్ విక్టరీ కొట్టారు. విపక్షాన్ని ఊది పారేశారు. ఆ తరువాత మొదలైంది అసలు రచ్చ. తనకే మళ్ళీ సీఎం పీఠం దక్కుతుందని భావించారు ఏక్ నాధ్ షిండే. కానీ అలా జరగలేదు. ఈసారి బీజేపీ ఈ పదవి తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పదవిని షిండేకు ఇచ్చింది.

దాంతో కొన్నాళ్ళ పాటు ఆయన అసంతృప్తిగా ఉన్నా చేసేది లేక చివరికి ఆ పదవిలో కుదురుకున్నారు. కానీ ఆయన వర్గీయులకు అన్యాయం జరుగుతోందని పదవుల విషయంలో సరైన న్యాయం దక్కడం లేదన్న వేదన షిండేలో ఉంది. జిల్లాలలో నియమించే సంరక్షక మంత్రి పదవి కోసం శివసేన నేత రాయ్ గడ్ జిల్లాలో ఆశించారు. అలా శివసేనకు చెందిన భగత్ గొగోవాలేకి ఈ పదవిని ఇప్పించాలని షిండే కూడా అనుకున్నారు.

జిల్లాల అభివృద్ధిలో నిధుల విడుదల ఖర్చు చేసే విషయంలో ఈ సంరక్షణ మంత్రులదే కీలకమైన పాత్ర. అందుకే ఈ పదవి కోసం శివసేన నేతలు కోరుకుంటున్నారు. కానీ ఈ పదవి మీద ఎన్సీపీ కూడా కన్నేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ పదవిని ఎన్సీపీకి ఇవ్వాలని చూడడంతో షిండే వర్గం రగిలిపోతోంది. తమకు ఆధిపత్యం ఉన్న రాయ్ గఢ్ జిల్లాలో ఎన్సీపీకి పదవి ఏంటని మండిపోతున్నారు.

ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాయ్ గఢ్ జిల్లా మీటింగ్ నిర్వహించారు. దీనిని శివసేన వర్గం ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దాంతో ఏదో జరుగుతోంది మయాయుతి కూటమిలో ముసలం పుట్టిందని అంటున్నారు. షిండే తన పూర్వం పార్టీ అయిన ఉద్ధవ్ థాక్రే శివసేనతో చేతులు కలుపుతారా లేక సొంతంగా రాజకీయం చేస్తారా లేక ప్రభుత్వాన్ని తన వైపు తిప్పుకుంటారా అన్న చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చి నెలలు కాలేదు అపుడే లుకలుకలు రావడంతో పాటు ఏక్ నాధ్ షిండే కుంపటి మెల్లగా రాజుకుంటోంది అని అంటున్నారు. చూడాలి ఈ పరిణామాలు ఎంతవరకూ దారితీస్తాయో అన్నది అంటున్నారు.

Tags:    

Similar News