ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు.. ప్రయాగ్ రాజ్ నుంచి తిరిగొస్తూ 7గురు దుర్మరణం
మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ జిల్లా సిహోరా వద్ద ఈ ఘోర ప్రమాదం మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ మహానగరానికి చెందిన ఎనిమిది మంది స్నేహితులు కలిసి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లటం.. తిరిగి వచ్చే ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న టెంపో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించారు. పుణ్యస్నానాలు చేసి.. ఆనందంగా తిరిగి వస్తున్న వారిలో ఏడుగురు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవటం వేదనకు గురి చేస్తోంది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని రాంగ్ రూట్ లో వస్తున్న లారీ వీరి ప్రాణాల్ని బలిగొని..వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది.
మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ జిల్లా సిహోరా వద్ద ఈ ఘోర ప్రమాదం మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వీరి వెనుక ఉన్న తెలంగాణకు చెందిన మరో కారు సైతం ఢీ కొంది. అయితే.. అందులో ప్రయాణిస్తున్న వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు గాయపడ్డారు. హైదరాబాద్ లోని నాచారంలోని కార్తికేయ నగర్ కాలనీ అధ్యక్షుడు 64 ఏళ్ల మల్లారెడ్డి.. అదే కాలనీకి చెందిన 56 ఏళ్ల రవికుమార్.. 47 ఏళ్ల సంతోష్ కుమార్, 62 ఏళ్ల బాలక్రిష్ణ, 37 ఏళ్ల శశికాంత్, 47 ఏళ్ల ఆనంద్ కుమార్, 55 ఏళ్ల ప్రసాద్, 45 ఏళ్ల నవీన్ కుమార్ మిత్రులు. వీరిలో నలుగురు బంధువులు. మిగిలినవారంతా కామన్ ఫ్రెండ్స్. ప్రతి ఏడాది వీరు ఏదో ఒక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది మహా కుంభమేళాకు వెళ్లాలని నెల రోజుల ముందే ప్లాన్ చేసుకున్నారు.
వారం రోజుల పాటు ఉత్తరాదిలో పుణ్యక్షేత్రాల్ని చుట్టిరావాలని శనివారం కార్తికేయనగర్ నుంచి బయలుదేరారు. ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరించిన వారు..అదే రోజు రాత్రి తిరుగుప్రయాణమయ్యారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా సిహోరా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రహదారిపై రాంగ్ రూట్ లో వచ్చిన సిమెంట్ బస్తాల లారీ తొలుత గుంటలో పడి.. ఎగిరి వీరు ప్రయాణిస్తున్న టెంపో మీద పడింది.దీంతో వీరి వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.
ఈ ఘటనలో మినీ బస్సులో ప్రయాణిస్తున్న మల్లారెడ్డి. రవికుమార్, సంతోష్ కుమార్, శశికాంత్, ఆనంద్ కుమార్, ప్రసాద్ లతో పాటు డ్రైవర్ బాలరాజు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాలక్రిష్ణ, నవీన్ గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారు ఇచ్చిన ఫోన్ నెంబర్ల ద్వారా అక్కడి జిల్లా కలెక్టర్.. పోలీసులు నాచారం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ప్రమాదంలో మరణించిన వారి డెడ్ బాడీలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అక్కడి అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన టెంపో వాహనం నెంబరుప్లేట్ ఏపీ అని ఉండటంతో తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా భావించారు. ఆ తర్వాత మరణించిన వారు తెలంగాణ వాసులు. హైదరాబాద్ కు చెందిన వారిగా తేల్చారు.