ఎన్నికల షెడ్యూల్ కి కౌంట్ డౌన్...ఏపీలో ఏప్రిల్ 15 తరువాత...!?
దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్ సభ స్థానాలు అలాగే ఏపీ, ఒడిషా సిక్కిం వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది
దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్ సభ స్థానాలు అలాగే ఏపీ, ఒడిషా సిక్కిం వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల షెడ్యూల్ ని రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 13,14 తేదీలలో ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనున్నారు అన్నది తాజా వార్త.
అంటే కేవలం అయిదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఒక్కసారి షెడ్యూల్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సాహా ఏపీ ఒడిషా తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆపద్ధర్మ ఏలికలు అవుతారు. అంటే జస్ట్ కేర్ టేకర్ ప్రభుత్వాలనే వీరు నడుపుతారు అన్న మాట.
ఇక ఏ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవు. కేంద్రం వరకూ చూస్తే ఈ నెల 3న కేంద్ర మంత్రివర్గం సమావేశం జరిపింది. అదే విధంగా పలు ముఖ్య నిర్ణయాలను తీసుకుంది. ఏపీలో చివరి మంత్రివర్గ సమావేశం మార్చి మొదటి వారంలో ఉంటుందని ప్రచారం సాగింది. ఇపుడు చూస్తూంటే అది లేనట్లుగానే అంతా భావిస్తున్నారు.
ఇక లోక్ సభ ఎన్నికలు ఈసారి ఏడు నుంచి ఎనిమిది దశలుగా సాగుతాయని అంటున్నారు. అదే ఏపీలో చూసుకుంటే మొదటి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి 20 మధ్యలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. గతసారి మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. నెల రోజుల తేడాలో అంటే ఏప్రిల్ 11న ఏపీలో మొదటి దఫాలోనే ఎన్నికలు జరిపించేశారు.
ఈసారి నాలుగైదు రోజులు లేట్ గా ఏపీలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఇక దేశంలో వివిధ రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన తరువాత మే నెల చివరి వారంలో ఎన్నికల ఫలితాలు రావచ్చు అని అంటున్నారు. అంటే కొత్త ప్రభుత్వాలు కేంద్రంలో ఏపీలో కొలువు తీరడానికి జూన్ నెల మొదటి వారం పట్టవచ్చు అని అంచనా వేస్తున్నారు.
ఏది ఎలా చూసుకున్నా ఏపీలో ఎన్నికలకు గట్టిగా ముప్పయి అయిదు రోజులు కూడా లేదు అన్నది ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అదే విధంగా చూసుకుంటే ఏపీలో ఏప్రిల్ 15 తరువాత ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం అన్న చర్చ కూడా సాగుతోంది. పొత్తుల ఎత్తులతో విపక్ష కూటమి బిజీగా ఉంది. అంతే కాదు ఇంకా అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసుకోలేదు.
ఇంత తక్కువ టైం లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని పరుగులు తీయించాలి. అభ్యర్ధులకు కూడా ఇది కీలకమైన టైం కాబోతోంది. ఏది జరిగినా ఈ నెల రోజులలోనే అద్భుతం జరగాలి. మొత్తం మీద బీజేపీ పొత్తులో కలవడం వల్ల కేంద్ర ప్రభుత్వం దన్ను కూటమికి దక్కుతుంది కాబట్టి దూకుడుగా ప్రచారం చేసుకునే వీలు ఉంటుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అన్నది మాత్రం అన్ని రాజకీయ పార్టీలలోనూ టెన్షన్ గానే ఉన్నది నిజం.