కోడెల కేసు...తిప్పి తిప్పి ఆయనకు చుట్టుకుందా ?
ఇప్పటికి ఆరేళ్ళ క్రితం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మ హత్య చేసుకున్నారు. 2019 సెప్టెంబర్ లో ఆయన తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఆ రోజుల్లో రాజకీయంగా కలకలం రేపింది.;
ఇప్పటికి ఆరేళ్ళ క్రితం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మ హత్య చేసుకున్నారు. 2019 సెప్టెంబర్ లో ఆయన తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఆ రోజుల్లో రాజకీయంగా కలకలం రేపింది. కోడెల ఆత్మహత్య వెనక అప్పటి వైసీపీ ప్రభుత్వం వేధింపులు ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. అలా రాజకీయ రచ్చ సాగింది.
అయితే ఇన్నేళ్ళ తరువాత ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తరువాత ఈ కేసు మళ్ళీ జీవం పోసుకుంటోంది అన్న చర్చ సాగుతోంది. కోడెల హత్య వెనక వైసీపీ మాజీ నేత వి విజయసాయిరెడ్డి ఉన్నారని అలాగే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మాజీ స్పీకర్ కోడెల ఆయన కుమారుడు శివరామక్రిష్ణల మీద తప్పుడు కేసులు పెట్టించారని కూడా ఈ ఫిర్యాదులో ఆరోపించారు. అలా మానసిక వేదనకు గురి చేసి ఆయనను ఆత్మహత్య దిశగా ప్రోత్సహించారని పేర్కొన్నారు.
తన మీద ఈ విధంగా మానసిక వేధింపులకు గురి చేయడం వల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. దీంతో ఒక్కసారిగా పల్నాడు రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పటి కోడెల కేసు ఇపుడు మళ్లీ జీవం పోసుకుని ఈ విధంగా ఫిర్యాదు రూపంలో రావడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది అన్నది చర్చగా ఉంది.
నిజానికి 2019లో వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నపుడు నంబర్ టూ గా తొలి దశలో విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఆయన అన్నింటా తానై కనిపించారు. దాంతో విజయసాయిరెడ్డికి ఈ విధంగా ఈ కేసుకు ముడిపెట్టి ఆయన మీద ఉచ్చు బిగించాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.
ఏకంగా రాజకీయాలకే విరామం ప్రకటించి సన్యాసం అని ప్రకటించిన విజయసాయిరెడ్డికి అనూహ్యంగా కోడెల కేసు మెడకు చుట్టుకోబోతుందా అన్నది చర్చకు వస్తోంది. తప్పుడు కేసులు కొడెల కుటుంబం మీద పెట్టడం వల్లనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారు అన్నది బలమైన ఆధారాలు ఉన్న కేసేనా అన్నది కూడా చర్చగా ఉంది.
ఈ ఆధారాలు ఎంతవరకూ నిలబడతాయన్నది పక్కన పెడితే ముందుగా కేసు కట్టించి ఆ మీదట పోలీస్ స్టేషన్ కి రప్పించి విచారణ పేరుతో చేయాల్సిన హడావుడి చేసేలా ఈ కేసులో కనిపిస్తోంది అని అంటున్నారు. తాడే పామై కరచింది అని ఒక సామెత. అలా ప్రతికూల పరిస్థితులు ఉంటే కనుక ఇలాగే జరుగుతాయని అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మీద కేసులు పెడుతోందని వేధిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఈ కేసులు ఎంతవరకూ వెళ్తున్నాయంటే నాకొద్దీ రాజకీయాలు అని ఒక దండం పెట్టేసి మరీ ఇంట్లో కూర్చుని ఉన్నా పోసాని క్రిష్ణ మురళీని తెచ్చి అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. రాజకీయ సన్యాసమే తీసుకున్నాను అని విజయసాయిరెడ్డి చెప్పినా ఆయన మీద కేసులు పడుతున్నాయి.
దీనిని బట్టి చూస్తూంటే వైసీపీ నేతలను టాప్ టూ బాటం 2019 నుంచి 2024 మధ్యన ఎవరైనా క్రియాశీలంగా ఉన్నారో వారి జాబితా దగ్గర పెట్టుకుని మరీ వారి మీద కేసులు పెడుతున్నారా అన్న చర్చ వస్తోంది. దీనిని వైసీపీ నుంచి ప్రతి విమర్శలు తప్ప న్యాయపరంగా కానీ ఇతరత్రా కానీ ఎదుర్కొనే శక్తియుక్తులు లేకపోవడం వల్ల కూడా కేసులు వరసగా పడుతున్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో ఎంతో బలముంది అనుకున్న వైసీపీకి ఇపుడు తానెంత బలహీనమో అర్ధం అయ్యేలా కూటమి పెద్దలు చేస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది.