ప్రలోభాలకు అడ్డేలేదా ? రు. 520 కోట్లు సీజ్
ఎన్నికలంటేనే డబ్బులు వెదచల్లటం అన్నట్లుగా అయిపోయింది. ఒకప్పుడు ఎన్నికల్లో డబ్బు ప్రవాహం మాత్రమే ఉండేది
ఎన్నికలంటేనే డబ్బులు వెదచల్లటం అన్నట్లుగా అయిపోయింది. ఒకప్పుడు ఎన్నికల్లో డబ్బు ప్రవాహం మాత్రమే ఉండేది. గడచిన రెండు ఎన్నికల్లో డబ్బుతో పాటు మద్యం, బంగారంతో పాటు ఇతర ప్రలోభాలు కూడా ఎక్కువైపోతున్నాయి. దీనికి తెలంగాణా ఎన్నికలే ఉదాహరణ. పోయిన నెల 9వ తేదీ నుండి మంగళవారం అంటే నవంబర్ 7వ తేదీ వరకు లెక్క తీసుకుంటే సుమారు రు. 520 కోట్లు పోలీసులు సీజ్ చేశారు. ఇందులో డబ్బు, మద్యం, బంగారం, వెండి, క్రీడా సామగ్రి, ఖరీదైన షూస్, కుక్కర్లు, బట్టలున్నాయి.
పైన దొరికినవాటికి అదనంగా మరోటి కూడా పోలీసులకు దొరికింది. అదేమిటంటే మాదక ద్రవ్యాలు కూడా పట్టుబడటమే పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసులు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా పట్టుబడేవి పట్టుబడుతున్నాయి, ఇతర మార్గాల్లో తప్పించుకునేవి తప్పించుకుంటునే ఉన్నాయి. పార్టీల నేతలు అనేక మార్గాల్లో యధేచ్చగా డబ్బు, మద్యం, బంగారం, వెండి, వజ్రాలు, కుక్కర్లు తదితరాలను రవాణా చేస్తునే ఉన్నారు.
తెలంగాణాకు చుట్టుపక్కల మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా సరిహద్దులుండటంతో నిఘావేయటం ప్రాక్టికల్ గా సాధ్యంకావటంలేదు. తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. అందుకనే ఆ ప్రాంతాల్లో ప్రత్యేక దళాలు గాలింపు చర్యలు చేస్తున్నాయి. వీళ్ళకి తోడుగా లోకల్ పోలీసులు కూడా అడవుల్లో తిరుగుతున్నారు. ఇలాంటి జిల్లాల్లో ఎన్నికల విధుల్లో పోలీసుల సంఖ్య తక్కువగా ఉంటోంది. అన్నీ పార్టీలకు ఇదే అదునుగా మారిపోయింది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పట్టుబడిందే రు. 500 కోట్లంటే ఇక యధేచ్చగా జనాల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇంకెంత ఉండుంటుంది ? ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటంలో ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేదు. ఏ పార్టీ తెలివిగా వ్యవహరిస్తుందో ఆ పార్టీ అభ్యర్ధులు యధేచ్చగా తమ టార్గెట్లను రీచవగలుగుతున్నారు. ఇందులో అధికారపార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. పోలీసులు ఎన్నికల కమీషన్ పరిధిలో పనిచేస్తున్నా ఎన్నికల విధుల్లో ఉండేవారు మాత్రమే కమీషన్ పరిధిలో ఉంటారు మిగిలిన వారు ?