హైదరాబాద్ కు ఎన్నికల సంక్రాంతి.. సిటీ అభ్యర్థులకు చుక్కలే

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు హైదరాబాద్ మహానగరంలో సరికొత్త సీన్ కు కారణమయ్యేలా చేసింది

Update: 2024-05-11 04:34 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు హైదరాబాద్ మహానగరంలో సరికొత్త సీన్ కు కారణమయ్యేలా చేసింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రచారానికి ఈ రోజు (శనివారం) బ్రేకులు పడనున్నాయి. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ జరగనుంది. గతానికి భిన్నంగా ఈసారి తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు అధికార కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అదే సమయంలో.. ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. దీంతో.. హైదరాబాద్ లో ఉండే తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారు.. ఏపీకి చెందిన వారంతా ఇప్పుడు తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.

సాధారణంగా సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మహానగరం బోసిపోతుంది. కారణం.. ఏపీకి చెందిన వారంతా తమ సొంతూళ్లకు ఈ పెద్ద పండక్కి వెళతారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో సంక్రాంతికి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. తెలంగాణలో దసరాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే.. వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లే అలవాటు ఈ మధ్యన తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారిలోనూ ఎక్కువైంది.

తాజాగా జరుగుతున్న ఎన్నికలు ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి. సాధారణంగా ఎంపీ ఎన్నికల మీద పెద్ద ఆసక్తి ఉండదు. కానీ.. తెలంగాణలో గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం.. అప్పటి అధికార పక్షం ప్రతిపక్షంగా మారటంతో.. ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కాంగ్రెస్ అధికారం గాలి వాటున వచ్చిందన్న వాదన నిజమని చెప్పాలని బీఆర్ఎస్ తపిస్తుంటే.. తమది గాలివాటు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాదన్న విషయాన్ని స్పష్టం చేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే.. తమ ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. హైదరాబాద్ లో ఉండే వారంతా తప్పనిసరిగా ఊళ్లకు రావాలని.. ఓట్లు వేయాలని కోరుతున్నారు. తెలంగాణ ముఖచిత్రం ఇలా ఉంటే.. ఏపీ లో మరింత సిత్రంగా ఉంది.

ఏపీలో అధికార.. విపక్షాల మధ్య రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం.. ఇప్పుడు ప్రజల వరకు వెళ్లిపోవటమే కాదు.. ఎవరికి వారు తాము సమర్థించే పార్టీల విజయాన్ని తమ వ్యక్తిగతంగా తీసుకున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఏపీకిచెందిన లక్షలాది మంది హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న నేపథ్యంలో.. వారి ఓట్లు తమకు అదనపు ప్రయోజనంగా మారతాయన్న విషయాన్ని గుర్తించిన ఏపీ అభ్యర్థులు హైదరాబాద్ నుంచి ఊళ్లకు తీసుకొచ్చే విధానానికి తెర తీశారు. 2014లో మొదలైన ఈ ట్రెండ్ అంతకంతకూ ముదురుతోంది.

ఈసారి ఇది మరింతగా పెరిగింది. ఏపీలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో తమ తీర్పును చెప్పాలన్న పట్టుదలను ఏపీకి చెందిన చాలామంది హైదరాబాదీయులు డిసైడ్ అయిన పరిస్థితి. దీంతో.. ఎవరికి వారు తమ సొంత ఖర్చులతో ఊళ్లకు వెళుతున్న వారున్నారు. అదే సమయంలో ప్రత్యేక బస్సులు.. రవాణా సౌకర్యాలను కల్పించిన నేతలకు అనుగుణంగా జర్నీలు చేస్తున్న వారున్నారు. దీంతో.. ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్నికల సంక్రాంతి సీజన్ నడుస్తోంది. సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిన చందంగా.. హైదరాబాద్ లో ఉన్న వారంతా ఎవరికి వారు వారి సొంతూళ్లకు వెళ్లిపోవటంతో.. ఇక్కడ జరిగే ఎన్నికల పోలింగ్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఏపీకి చెందిన పలువురు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి రెండు చోట్ల ఓట్లు ఉండటం.. అవసరానికి అనుగుణంగా ఓటేసే కారణంగా ఈ స్పెషల్ సీన్ చోటు చేసుకుందని చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ‘మే’లో హైదరాబాద్ ఖాళీ కానుంది. ఇదో అరుదైన పరిణామంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News