ఆ 'మెదడులో ఇష్మార్ట్ చిప్' కొట్టేసింది.. మరి తర్వాత ఏం జరిగింది?
ఐదేళ్ల కిందట తెలుగులో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గుర్తుందా..? అందులో హీరో రామ్ మెదడులో చిప్ పెడతారు.
ఐదేళ్ల కిందట తెలుగులో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గుర్తుందా..? అందులో హీరో రామ్ మెదడులో చిప్ పెడతారు. తెలంగాణ యాసతో రామ్ చురుకైన నటన.. దర్శకుడు పూరీ జగన్నాథ్ డైలాగ్స్ అద్భుతంగా పేలాయి. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. అయితే, ఈ సినిమాకు ఆలోచన ఎలా వచ్చిందో? లేక ఇలా చేయొచ్చని ఆ అపర కుబేరుడికి ఆలోచన వచ్చిందో కానీ.. ఏకంగా మనిషి మెదడులోకి చిప్ పంపి సంచలనమే రేపాడు.
ఐదు నెలల కిందట
‘‘మనిషి మెదడులోకి ఎలక్ట్రానిక్ చిప్’’.. ఈ విషయం కొన్నేళ్ల కిందట అయితే అసాధ్యం అనేవారేమో. కానీ, దానిని సుసాధ్యం చేశాడు ప్రపంచ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్. ఈ మేరకు జనవరి చివరిలో
నోలాండ్ ఆర్బాగ్ అనే వ్యక్తికి విజయవంతంగా చిప్ ను అమర్చామని న్యూరాలింక్ వ్యవస్థాపకుడు అయిన ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆరంభ ఫలితాల్లో స్పష్టమైన ‘న్యూరాన్ స్పైక్ డిటెక్షన్’ను గుర్తించినట్లు పేర్కొన్నారు. కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్ -కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ’ 2023 మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్ చి ప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఒక కోతి ‘పాంగ్’ వీడియో గేమ్‌ను ఆడడం గమనార్హం.
ప్చ్.. చిప్ ఆగింది.. కానీ,
నోలాండ్ అర్బాగ్ కు అమర్చిన చిప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మెదడులో కణజాలానికి అమర్చిన కొన్ని ఎలక్ట్రోడ్ థ్రెడ్స్ చెదిరాయి. దీంతో చిప్ పనిచేయడం ఆగిపోయింది. అయితే, సాఫ్ట్ వేర్ సాయంతో దీనిని సరిదిద్దినట్లు న్యూరా లింగ్ తెలిపింది. అనంతరం చిప్ మరింత సమర్థంగా పనిచేస్తోందని కూడా పేర్కొంది.
న్యూరాలింక్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్ ఉంటుంది. దీనికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్ లో మూడువేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్ నకు పంపుతాయి. ఒక చిప్ లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్ లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్ స్టాల్ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది.
కాగా, తరచూ వార్తల్లో ఉండడం వల్ల న్యూరాలింక్ ప్రాజెక్టు గురించి మాత్రమే ఎక్కువగా బయటకు వస్తోంది. కానీ, ఈ తరహా ప్రయోగాలు మరికొన్ని సంస్థలూ చేపడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ 2022 జులైలోనే అమెరికా వ్యక్తికి ఈ తరహా చిప్ అమర్చింది. న్యూరాలింక్ మనిషి పుర్రెకు కోత పెట్టిందని తాము అలా చేయలేదని వెల్లడించింది.