ఎన్నికల వేళ మోడీతో మస్క్ భేటీ.. ఏం జరగనుంది?

ఇందులో భాగంగా ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు షురూ అయ్యాయి.

Update: 2024-04-11 04:35 GMT

ఎంతోకాలంగా ఊరిస్తున్న టెస్లా.. భారత్ లో ప్లాంట్ పెట్టేందుకు రెఢీ అవుతోందా? ఆ మధ్య వరకు భారత్ లో ప్లాంట్ పెట్టేందుకు ససేమిరా అనటం.. దిగుమతి చేసిన కార్లను అమ్మాలన్న ఆలోచనతో ఉన్న మస్క్ కు మోడీ మాష్టారు తన స్పందనను అతనికి ‘అర్థమయ్యే భాష’లో చెప్పటం తెలిసిందే. మొత్తానికి తన మొండితనాన్ని పక్కన పెట్టి.. భారత్ లో టెస్లా కార్ల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు షురూ అయ్యాయి. భారత్ కు టెస్లా వస్తున్న నేపథ్యంలో తమ రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలంటూ పలు రాష్ట్రాలు ఇప్పటికే పోటీ పడుతున్నాయి. ఈ రేసులో గుజరాత్.. మహారాష్ట్ర. తెలంగాణ.. తమిళనాడు రాష్ట్రాలు ఉండటం తెలిసిందే. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఒక అడుగు ముందుకేసి.. టెస్లాతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లుగా గతంలోనే పేర్కొన్నారు.

అయితే.. ఈ అంశంపై టెస్లా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా తన భారత్ పర్యటనపై ఎలాన్ మస్క్ తన ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. భారత ప్రధాని మోడీతో తాను భేటీ అయ్యే సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏప్రిల్ 22న ఢిల్లీలో ప్రధాని మోడీతో మస్క్ భేటీ కానున్నట్లుగా వెల్లడించారు. ఈ భేటీ అనంతరం మస్క్ తన భవిష్యత్ ప్రణాళికల్ని వెల్లడిస్తారని భావిస్తున్నారు. ఈ పర్యటనలోనే టెస్లా భారత్ ఎంట్రీ ఎప్పుడన్న అంశంపై స్పష్టత రావటంతో పాటు.. ఆయన ఏ రాష్ట్రంలో ప్లాంట్ నిర్మిస్తారన్న దానిపై అధికారిక ప్రకటన ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ఎన్నికల వేళ మస్క్ భారత్ పర్యటన.. మోడీతో భేటీ ఇవన్నీ చూస్తుంటే.. ఒక క్రమపద్దతితో కూడిన ప్లానింగ్ తోనే ఇదంతా సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News