ఎక్స్ లో మస్క్ మార్కు ఫీచర్... ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్!
ఇదే సమయంలో... ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ప్రకటించిన ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ ఏమి చేసినా సంచలనమే అంటుంటారు ఆయన ఫ్యాన్స్! ట్విట్టర్ లో బ్లూ టిక్ కి డబ్బులు వసూల్ చేసినా.. ట్విట్టర్ లో పిట్టను తీసి కుక్కను పెట్టినా.. ఇప్పుడు దాన్ని ఎక్స్ గా చేసినా.. ఏదైనా మస్క్ ఏమి చేసినా ప్రపంచం మొత్తం చర్చించుకునేలానే చేస్తారని అంటుంటారు. ఈ సమయంలో మరో సంచలనానికి తెరలేపారు.
అవును... ఎలాన్ మస్క్ తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. ఇందులో భాగంగా ఎక్స్ (ట్విట్టర్)లో వీడియో, ఆడియో కాల్స్ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎలాన్ మస్క్ తాజాగా వెల్లడించారు. ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్ లో కాల్ సదుపాయం తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఈ వివరాలు వెల్లడించారు.
ఇదే సమయంలో... ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ప్రకటించిన ఎలాన్ మస్క్... దీనికోసం ఫోన్ నంబర్ అవసరం లేదని అన్నారు. ఇదే క్రమంలో... ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్ బుక్ కు ఎక్స్ వేదిక కానుందని.. ఇందులో ఫీచర్లన్నీ ప్రత్యేకంగా ఉంటాయని తాజాగా ప్రకటించారు మస్క్.
ఇదిలా ఉంటే.. త్వరలో ఎక్స్ లో అందుబాటులోకి వచ్చే ఆడియో, వీడియో కాల్ సదుపాయం బ్లూ టిక్ కలిగియున్న వారికి మాత్రమే అందుబాటులోకి వస్తుందా.. లేక, అకౌంట్ ఉన్న అందరికీ అందుబాటులోకి వస్తుందా అనే విషయంపై మాత్రం మస్క్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కచ్చితంగా ఇది మాత్రం పెయిడ్ సర్వీసే అయ్యి ఉండే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... ట్విటర్ లో ఆడియో, వీడియో కాల్ సదుపాయం గురించి చర్చ జరగడం ఇదే ఫస్ట్ టైం కాదు. జూలై లో ఈ ఫీచర్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ లను కంపెనీ డిజైనర్ ఆండ్రూ కాన్వే ఆన్ లైన్ వేదికగా పంచుకున్నాడు. అయితే ఫోన్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్ చేసుకొవచ్చనే మాస్క్ తాజా ప్రకటన ట్విటర్ యూజర్స్ లో ఆసక్తిని మాత్రం రేపుతోంది.