‘ఎమ్మార్’ వ్యవహారాన్ని రేవంత్ కొలిక్కి తెస్తారా?

2015 అక్టోబర్ లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మార్ వివాదాల పరిష్కారానికి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఐదుగురు సెక్రటరీల కమిటీని ఏర్పాటు చేసింది.;

Update: 2025-02-28 04:48 GMT

ఎమ్మార్ ప్రాపర్టీస్..రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో పతాక శీర్షికల్లో వస్తూనే ఉంది. దుబాయికి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ 2001లో హైదరాబాద్ లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో అక్రమాలు జరిగాయని అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేయగా..విచారణలు ఇప్పటికీ కొనసాగుతుండడం గమనార్హం. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో కుదిరిన ఒప్పందాలను మార్చింది. ఎమ్మార్ చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటాను 49 శాతం నుంచి కేవలం 4 శాతానికి తగ్గించడం వివాదానికి దారితీసింది. ఆ సంస్థ నుంచి వైఎస్ భారీ ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణకు ఆదేశాలు జారీ కావడంతో ఎమ్మార్ పనులు ఆగిపోయాయి.

2015 అక్టోబర్ లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మార్ వివాదాల పరిష్కారానికి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఐదుగురు సెక్రటరీల కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ అలాగే ఉండిపోయింది. ఈక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధులు మళ్లీ హైదరాబాద్ కు వచ్చారు. గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై సీఎం సమీక్షించారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయనిపుణులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలనూ పరిశీలించాలన్నారు. ఈ దిశగా యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని ఎమ్మార్ ప్రాపర్టీస్ యజమాని మహ్మద్ అలీ రషీద్ ప్రతిపాదించగా సీఎం అంగీకరించారు.

ఇదిలా ఉండగా ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రాజెక్టు కోసం తమ భూములను బలవంతంగా సేకరించారని, తమ భూములు తమకు అప్పగించాలని నానక్ రామ్ గూడ ప్లాట్ ఓనర్ల సంఘం సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. వీరంతా సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి వినతి పత్రం అందించారు. నానక్ రామ్ గూడలో 2002లో 360 మందిమి కలిసి తమ కష్టార్జితంతో 23 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసుకుని ఇళ్ల నిర్మాణాలకు ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. 2005లో అప్పటి వైఎస్ ప్రభుత్వం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ భూమిని స్వాధీనం చేసుకుని ఎమ్మార్ ప్రాపర్టీస్ కు కేటాయించిందని వాపోయారు. అందులో ఎక్కువ భాగం నిరుపయోగంగానే ఉందని, దాన్ని స్వాధీనం చేసుకుని తమకు అప్పగించాలని కోరారు బాధితులు.

రెండు దశాబ్దాలుగా ఎన్నో వివాదాలు, చిక్కుముడులతో జఠిల వ్యవహారంగా మారిపోయిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కథను రేవంత్ కంచికి చేరుస్తారా లేదా అనేది చూడాలి. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన సవాళ్లతో కూడిన అంశాలనే చేపడుతూ తనదైన మార్క్ తో పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు. మరి ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారానికి ఎలాంటి ముగింపు ఇస్తారో అనేది భవిష్యత్ లోనే తేలనుంది.

Tags:    

Similar News