న్యూయార్క్ కు ఏమైంది? ఎమర్జెన్సీ ఎందుకు ప్రకటించారు?

అమెరికాలోని మహానగరాల్లో న్యూయార్క్ ఒకటి. తాజాగా.. ఈ మహానగర వాసులకు అరుదైన హెచ్చరిక జారీ అయ్యింది.

Update: 2023-09-30 04:55 GMT

అమెరికాలోని మహానగరాల్లో న్యూయార్క్ ఒకటి. తాజాగా.. ఈ మహానగర వాసులకు అరుదైన హెచ్చరిక జారీ అయ్యింది.తాజాగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో న్యూయార్క్ మహానగరం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అక్కడి గవర్నర్ తాజాగా ఎమర్జెన్సీని ప్రకటించారు. శుక్రవారం రాత్రి హటాత్తుగా కురిసిన వర్షానికి ఈ మెగా సిటీలోని రోడ్లు మొత్తం జలమయం అయ్యాయి.

దీంతో.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సబ్ వేలు.. ఎయిర్ పోర్టులోకి వరద నీరు చేరుకున్న దుస్థితి. ఈ నేపథ్యంలో సబ్ వేలు.. ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసేశారు. పలు రైళ్లు రద్దు అయ్యాయి. కుండపోతగా కురుస్తున్న వర్షానికి వరద ముప్పును ఎదుర్కొంటున్నారు. దీంతో.. న్యూయార్క్ వాసులు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి.

వాతావరణ విభాగం అంచనా చూస్తే.. భారీ వర్షం మరింతగా కురిసే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో న్యూయార్క్ నగర మేయర్ స్పందిస్తూ.. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన న్యూయార్క్ లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితిని చూసిన వారంతా.. రెండేళ్ల క్రితం సెప్టెంబరు నెలలో ముంచుకొచ్చిన వరదల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మొత్తంగా తాజాగా కురుస్తున్న భారీ వర్షం న్యూయార్క్ వాసుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

Tags:    

Similar News