ఏపీ - టీజీ... ఉద్యోగుల మార్పిడి ప్రచారంలో నిజమెంత?

దీంతో.. ఈ ప్రచారం నిజమేనా, కేవలం ప్రచారం మాత్రమేనా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి.

Update: 2024-06-18 03:48 GMT

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఏపీకి వెళ్లడానికి కొంతమంది ఆసక్తి ఊపించగా.. తెలంగాణకు వీడటానికి ఇంకొంతమంది అనాసక్తి చూపించిన పరిస్థితి. అయినప్పటికీ... పోస్టుల లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరిని ఏపీకి.. ఏపీ స్థానికత ఉన్న కొందరిని తెలంగాణకు కేటాయించారు.

ఈ సమయంలో ప్రధానంగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాల్లో ఉండటం, పిల్లల చదువుల విషయంలో పలువురు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి వెళ్లేందుకు ఛాన్స్ ఇవ్వాలని తెలంగాణకు కేటయించిన 1369 మంది ప్రభుత్వాన్ని కోరారు. దీంతో... తమకేమీ అభ్యంతరం లేదని చెబుతూ 2021 సెప్టెంబర్ లో సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం.

ఇదే క్రమంలో... తెలంగాణకు వెళ్లిపోయేందుకు ఛాన్స్ ఇవ్వాలని 1808 మంది వివరాలూ సేకరించింది. దీంతో 2022 సెప్టెంబర్ 23న అప్పటి ఏపీ సీఎస్... తెలంగాణ సీఎస్ కు ఇదే విషయంపై లేఖ రాశారు. ఉద్యోగుల పరస్పర బదిలీకి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే ఈ వ్యవహారం గత కొన్నేళ్లుగా నానుతూనే ఉంది.

అయితే... జూన్ 2 నుంచి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశం సమాప్తమయ్యి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉన్న నేపథ్యంలో... ఏపీకి కేటాయించిన ఆఫీసు భవనాలు, విభజన చట్టంలోని అంశాలు మొదలైన పరిష్కారం కాని అంశాల వివరాలను రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పరస్పర ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన సమాచారం సేకరించింది.

దీంతో... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో.. ఈ ప్రచారం నిజమేనా, కేవలం ప్రచారం మాత్రమేనా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి. అయితే... ఏపీలో ఉండి తెలంగాణకు రావడానికి సిద్ధపడిన ఉద్యోగుల సమాచారం అయితే సీఎం రేవంత్ కోరారు కానీ... ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.

అవును... ఏపీ నుంచి ఉద్యోగులు తెలంగాణకు బదిలీ అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, దాన్ని ఏమాత్రం నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే... రాష్ట్రం ఏర్పడిన ఏడాది, రెండేళ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపు కొలిక్కివచ్చిందని.. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలేమీ తీసుకోలేదని వెల్లడించింది. దీంతో... ఉద్యోగుల మార్పిడి అనేది కేవలం ప్రచారం మాత్రమే అని తేలింది!

Tags:    

Similar News