ఆమెకు 78, అతడికి 34... ఫేస్ బుక్ ప్రేమలో తీవ్ర విషాదం!
పబ్జీ ప్రేమలూ, ఫేస్ బుక్ ప్రేమలూ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే
పబ్జీ ప్రేమలూ, ఫేస్ బుక్ ప్రేమలూ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ వివాహిత, పాకిస్థాన్ అవివాహితుడి మధ్య ప్రేమ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందనేది తెలిసిన విషయమే. ఇదే క్రమంలో... భారత్ యువకుడు, బంగ్లా యువతి ప్రేమకథల సంగతీ తెలిసిందే.
ఇదే క్రమంలో... ఢిల్లీలో యువకుడి కోసం పాక్ లో భర్తకు విడాకులు ఇచ్చి, ఇల్లు అమ్ముకుని, ఆ డబ్బులు తీసుకొని, పిల్లలను వెంటబెట్టుకుని భారత్ కి వయా దుబాయ్, నేపాల్ వచ్చిన మహిళ సంగతీ తెలిసిందే! అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది అంతకు మించిన డిఫరెంట్ లవ్ స్టోరీ! కాకపోతే ఆ కథలో తాజాగా విషాదం అలుముకుంది!
అవును... వయసులో ఉన్నప్పుడు వివాహితులు, అవివాహితులు కలిసి ఆన్ లైన్ లో ప్రేమించుకోవడం.. ఆనాక కుటుంబాలను వదిలి ఒక్కటి అవ్వడం ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్నాయి! అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఫేస్ బుక్ లవ్ స్టోరీలో అమెరికాకు చెందిన ఆమె వయసు 78 కాగా.. భారత్ కు చెందిన అతడి వయసు 34.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని టెక్సాస్ కు చెందిన జాక్వెలిన్ ఆస్టిన్ (78)కు భారత్ కు చెందిన భరత్ జోషీ (34)తో ఆన్ లైన్ లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి ఫేస్ బుక్ పరిచయం కాస్తా తొలుత స్నేహం, అనంతరం ప్రేమగా మారింది. దీంతో గత ఏడాది ఆగస్టులో ప్రియుడి కోసం రాజస్థాన్ లోని కోటాకు వచ్చేసింది జాక్వెలిన్.
ఆ తర్వాత డిసెంబర్ నెలలో స్థానిక కోర్టులో తన వయసులో సగం కూడా లేని భరత్ జోషీని పెళ్లి చేసుకుంది. ఇలా వారి నూతన దాంపత్య జీవితం ఇండియాలోనే కొనసాగుతున్న సమయంలో.. ఆమె అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడేది. అయితే ఇటీవల ఆమె అనారోగ్యానికి గురైంది.
వృద్ధాప్యం కారణంగా అనారోగ్యానికి గురికావడంతో ఆమెను ఇటీవల స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం జైపూర్ తరలిస్తుండగా ఆమె మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. దీంతో... ఈ ఫేస్ బుక్ ప్రేమలో తీవ్ర విషాదం నెలకొన్నట్లయ్యింది!