వైరల్‌ వీడియో.. ఈ తండ్రి కష్టం మరెవరికీ రాకూడదు!

తన బిడ్డకు ఒక తండ్రి పడిన కష్టం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

Update: 2024-06-19 07:25 GMT

ఏ ప్రభుత్వాలైనా విద్య, వైద్య, ఆరోగ్య రంగాలపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలి. వైద్య, ఆరోగ్య రంగాలను తాము ఎంతో అభివృద్ధి చేశామని పాలకులు చెప్పుకుంటున్నా ఈ మాటల్లోని డొల్లతనం ఇప్పటికీ బయటపడుతోంది.

తన బిడ్డకు ఒక తండ్రి పడిన కష్టం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో విషయం వెలుగులోకొచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు విశాఖ కింగ్‌ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్‌) ప్రసూతి విభాగానికి తీసుకొచ్చారు. శిరీష నెలలు నిండకుండానే ఒక బిడ్డను ప్రసవించింది. నెలలు నిండాకుండానే జన్మించడం, బరువు తక్కువ ఉండటంతో ఆ చిన్నారిని పిల్లలవార్డుకు అనుబంధంగా ఉన్న నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ)లో పెట్టాలని చెప్పారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్‌ పెట్టారు.

ఈ క్రమంలో బిడ్డను ఎత్తుకుని నర్సు ముందు నడుస్తుండగా బిడ్డ తండ్రి విష్ణమూర్తి ఆక్సిజన్‌ సిలిండర్‌ ను తన భుజాల మోస్తూ ఆమె వెనుకే నడుచుకుంటూ వెళ్లారు. సమయానికి సిబ్బంది లేకపోవడంతో బిడ్డ తండ్రే ఆక్సిజన్‌ సిలిండర్‌ ను భుజాన మోస్తూ వెళ్లాల్సి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసినవారు అయ్యో పాపం అనుకున్నారు. బిడ్డ కోసం తండ్రి పడుతున్న కష్టం చూసి వారి కళ్లు చెమర్చాయి. ఆక్సిజన్‌ సిలిండర్‌ ను మోసుకుంటూ నర్సు వెనకాల నడుస్తుండటం అందరి హృదయాలను బాధతో మెలిపెట్టింది.

దీన్ని ఎవరో వీడియో తీయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కోస్తా జిల్లాల్లోనే పేరున్న కింగ్‌ జార్జి ఆస్పత్రిలో కూడా ఇలాంటి ఘటన జరగడం అందరినీ నివ్వెరపరిచింది. అందులోనూ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో ఈ ఘటన వెలుగుచూడటం ఇబ్బందిగా మారింది.

దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ శివానంద ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందిని పిలిచి జరిగిన ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇక నుంచి ఇలాంటివి జరగకుండా బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామని ఆయన చెప్పారు.

Full View
Tags:    

Similar News