ఫిబ్రవరి 8 కీలకమా ?

పోటీచేయాల్సిన నియోజకవర్గాలు ఏవి అన్న విషయమై చర్చించేందుకు ఆదివారం రెండుసార్లు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే.

Update: 2024-02-05 05:49 GMT

ఫిబ్రవరి 8వ తేదీ రెండుపార్టీలకు కీలకమయ్యేట్లుంది. రాబోయే ఎన్నికల్లో పొత్తులో ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలి ? పోటీచేయాల్సిన నియోజకవర్గాలు ఏవి అన్న విషయమై చర్చించేందుకు ఆదివారం రెండుసార్లు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. పవన్ 32 సీట్లు కావాలని అడిగితే చంద్రబాబు 25 నియోజకవర్గాలకు ఓకే చెప్పారట. అయితే పవన్ గట్టిగా పట్టుబడితే మరో మూడు సీట్లను ఇచ్చే అవకాశముందని అంటున్నారు. అంటే జనసేన ఎక్కువలో ఎక్కువ 28 సీట్లలో పోటీచేస్తుందని తేలిపోయింది.

జనసేనకు కేటాయించే 25 సీట్లలో భేటిలో 20 నియోజకవర్గాలపై ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు. అందులో పది నియోజకవర్గాలు యలమంచిలి, రాజోలు, రాజానగరం, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ పశ్చిమం, తెనాలి, దర్శి, కాకినాడ రూరల్ పేర్లు లీకయ్యాయి. మిగిలిన పేర్లు బయటకు రాలేదు. సీట్ల సంఖ్య, నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు నియోజకవర్గాల జాబితాను ఫైనల్ చేయటానికి ఫిబ్రవరి 8వ తేదీన మరోసారి వీళ్ళిద్దరు భేటీ అవబోతున్నారు. ఆరోజు భేటీలో అన్నీ విషయాలను ఫైనల్ చేసేసి అధికారిక ప్రచటన చేయాలని అనుకున్నట్లు సమాచారం.

అంటే రెండుపార్టీలకు ఫిబ్రవరి 8వ తేదీ చాలా కీలకం అవబోతోందని అర్ధమవుతోంది. భేటీ తర్వాత అధికారిక జాబితా విడుదల చేయాలా ? లేకపోతే 12వ తేదీన నిర్వహించబోయే ఉమ్మడి పాలకొల్లు సభలో ప్రకటించాలా అన్నది తేలలేదట. బహిరంగసభలోనే ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటించే అవకాశముంది. పాలకొల్లు సభ నుండి ఉమ్మడి ప్రచార షెడ్యూల్ ను అమలు చేయబోతున్నారు.

జాబితా, మ్యానిఫెస్టో ఖాయమైతే ప్రచారంలోకి ఉమ్మడిగా వెళ్ళటం పెద్ద విషయంకాదని అందరికీ తెలిసిందే. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధుల జాబితాలను ప్రకటించేస్తున్నారు. టికెట్లు ఖాయమైన అభ్యర్ధులు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ప్రకటించిన సీట్లలో ఎక్కడైనా మార్చాల్సొస్తే మళ్ళీ వెంటనే అక్కడ కూడా మార్చేస్తున్నారు. అలాగే సిద్ధంపేరుతో రెండు బహిరంగసభల్లో జగన్ పాల్గొన్నారు. ఒకవైపు వైసీపీ దూసుకుపోతుంటే మరోవైపు కూటమిలో ఇంకా సీట్లు కూడా ఫైనల్ చేయలేదనే అసంతృప్తి రెండుపార్టీల నేతల్లోను కనబడుతోంది. అందుకనే చంద్రబాబు, పవన్ స్పీడు పెంచారు. మరి ఫిబ్రవరి 8వ తేదీన ఎలాంటి ప్రకటన ఉంటుందో చూడాలి.


Tags:    

Similar News