ప్రకృతిలో అయిదో శక్తి... అద్భుతం సృష్టించబోతున్నారా?
ప్రకృతిలో అయిదో శక్తిని కనుగొనడంలో తాము సమీప దూరానికి వచ్చినట్లు షికాగోకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు
న్యూటన్ శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారం... శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేదు.. కాకపోతే ఒకరూపం నుంచి మరో రూపానికి మార్చగలము! అయితే అలా కాదు... శక్తిని సృష్టించగలమని చెబుతూ ప్రయోగాలు చేస్తున్నారు షికాగోకు చెందిన శాస్త్రవేత్తలు. పైగా ఈ విషయంలో దగ్గరకు వచ్చినట్లు చెబుతున్నారు.
అవును... ప్రకృతిలో అయిదో శక్తిని కనుగొనడంలో తాము సమీప దూరానికి వచ్చినట్లు షికాగోకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సబ్ ఆటమిక్ పార్టికల్స్ మ్యుయాన్స్ ప్రస్తుత సబ్ ఆటమిక్ ఫిజిక్స్ సిద్ధాంతాల ప్రకారం ఉన్న అంచనాల తరహాలో భిన్నంగా ప్రవర్తిస్తున్నాయనడానికి శాస్త్రవేత్తలు ఆధారాలు కనుగొన్నారని తెలుస్తోంది.
ప్రతి రోజూ మనం అనుభూతి చెందే శక్తులను నాలుగు కేటగిరీల కింద వర్గీకరించారు. అవి... గురుత్వాకర్షణ శక్తి, విద్యుదయస్కాంత శక్తి, బలమైన అణు శక్తి, బలహీన అణు శక్తి. విశ్వంలోని అన్ని పదార్థాలు, రేణువులు ఒకదానితో ఒకటి ఎలా అసంధానమవుతాయన్నది ఈ నాలుగు శక్తులు నియంత్రిస్తాయి.
అయిదో శక్తికి సంబంధించిన అంశాలను అమెరికా పార్టికల్ యాక్సిలేటర్ ఫెసిలిటీ ఫెర్మిలాబ్ లో కనుగొన్నారు. 2021లోనే తొలిసారి ఈ ఫలితాలపై ఒక ప్రకటన చేశారు. ఆ సందర్భంగా విశ్వంలో అయిదో శక్తికి అవకాశముందని ఫెర్మిల్యాబ్ టీమ్ సూచించింది. అప్పటి నుంచి ఈ పరిశోధన బృందం మరింత డేటాను సేకరించే పనిలో ఉంది!
ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఐదో శక్తి ఉనికి సంచలనం కలిగిస్తోంది. ఫెర్మిల్యాబ్ శాస్త్రవేత్తలు "జీ మైనస్ 2" ప్రయోగంతో దీన్ని గుర్తించారు. ఈ ప్రయోగంలో మ్యూయాన్స్ అనే ఉప పరమాణు కణాలను 50 మీటర్ల వ్యాసం కలిగిన రింగు ద్వారా అతి వేగంగా కదిలించారు. దీన్ని దాదాపు కాంతి వేగం వద్ద 1000 రెట్ల వేగంతో ప్రవహించేలా చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... మ్యూయాన్స్ అనేవి అణువుల చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల మాదిరి ఉప పరమాణు కణాలే. కానీ ఇవి సుమారు 200 రెట్లు పెద్దగా ఉంటాయి. ఫెర్మిల్యాబ్ శాస్త్రవేత్తలు వీటిని సూపర్ కండక్టింగ్ అయస్కాంతాల సాయంతో అటూఇటూ ఊగేలా చేయగా... ఇవి ఊహించిన దాని కన్నా చాలా వేగంతో ఊగిసలాడాయి.
మ్యూయాన్స్ ఈ విచిత్ర ప్రవర్తనకు కొత్త శక్తి ప్రభావమే కారణమని భావిస్తున్నారు. దీన్నే ఐదో ప్రాథమిక శక్తిగా ఊహిస్తున్నారు. ఒకవేళ ఇది ధ్రువీకరణ అయితే... ఐన్ స్టీన్ సాపేక్షక సిద్ధాంతాల నుంచి ఇప్పటివరకు వందల ఏళ్లలో చేపట్టిన అతిపెద్ద సైన్స్ అద్భుతావిష్కరణలో ఇదొకటి కానుంది.