ఫైర్ బ్రాండ్ ఫ్యామిలీకి ఒక్క సీటే.. బాబు క్లారిటీ, నెక్ట్స్ ఏంటి?
అయితే.. వీటిలో తాడిపత్రి ఇచ్చేందుకు బాబు అంగీకరించినా.. అనంతపురం ఎంపీ సీటు విషయంలో కుదరదని తేల్చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా ఎదిగిన జున్నూరు చంటి(జేసీ) బ్రదర్స్ రూటెటు? వచ్చే ఎన్నికల్లో వారు ఏం చేయనున్నారు? ఒంటరిగానే బరిలోకి దిగుతారా? లేక.. పార్టీ మారే వ్యూహం ఉందా? ఇదీ.. ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ప్రస్తుతం ఈ కుటుంబం టీడీపీలో ఉంది. అనం తపురం జిల్లాలోని రెండు సెగ్మెంట్లను వారు కోరుతున్నారు. అనంతపురం ఎంపీ, తాడిపత్రి నియోజకవర్గా లను వారికి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును వారు అభ్యర్థిస్తున్నారు.
అయితే.. వీటిలో తాడిపత్రి ఇచ్చేందుకు బాబు అంగీకరించినా.. అనంతపురం ఎంపీ సీటు విషయంలో కుదరదని తేల్చేశారు. వైసీపీ ఇక్కడ బీసీకి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో తాము కూడా బీసీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తేల్చి చెప్పారు. ఈ పరిణామం జేసీ వర్గంలో అసంతృప్తిని రాజేసింది. తమకు రెండు ఇస్తున్నారు కదా.. ఇప్పుడు ఎందుకు ఇవ్వరని మాజీ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఒకింత గట్టగానే ప్రశ్నించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయినా.. చంద్రబాబు కుదరదని తేల్చి చెప్పారు.
మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో తమ వారసులను చట్ట సభల్లోకి పంపించాలని గట్టిగా నిర్ణయించుకున్న జేసీ బ్రదర్స్ టికెట్ రాని పక్షంలో ఏం చేయాలనే దానిపైనా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తాడిపత్రి నుంచి టికెట్ తీసుకుని.. పార్లమెంటు స్థానానికి ఒంటరి పోరు చేయించాలని అనుకుంటున్న ట్టు తెలుస్తోంది. అయితే.. దీనికి టీడీపీ ఒకప్పుకొనే అవకాశం లేదు. ఒక పార్టీలో ఉంటూ.. ఒక టికెట్ తీసుకు ని.. రెండో టికెట్ కోసం. ఇలా ఒంటరి పోరు చేస్తామంటే కుదిరేది కాదు.
అయితే.. వాస్తవానికి జేసీ బ్రదర్స్ ఇలా ఎందుకు ఎదురుగాలి వీచే పరిస్థితి వచ్చారంటే.. వారు సొంతగా చేసుకున్నదే. పార్టీలో ఉన్నా.. పార్టీని పట్టించుకోకపోవడం, కేడర్కు చేరువ కాకపోవడం వంటివి మైనస్ అయ్యాయి. అధినేతతో కూడా అవసరం ఉంటేనే వచ్చి కలుస్తున్నారు తప్ప. రూపాయి ఖర్చు పెట్టడం లేదు. పైగా.. క్షేత్రస్తాయిలో తమ హవా కొనసాగిస్తున్నారు. ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ పరిణామాలతో చంద్రబాబు కూడా మనస్తాపంతో ఉన్నారు. ఒకప్పుడు వీరు కోరగానే రెండు టికెట్‌లు ఇచ్చిన బాబు.. ఇప్పుడు ఆలోచనలో పడడానికి వారు చేసుకున్నదేనని అంటున్నారు పార్టీ సీనియర్లు.