రఘురామ కేసులో సీఐడీ మాజీ అధికారి అరెస్ట్

రఘు రామ కృష్ణరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో సీఐడీ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన అధికారి విజయపాల్ ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-11-27 03:42 GMT

వైసీపీ ప్రభుత్వంలో రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామ క్రిష్ణంరాజుని పుట్టిన రోజు వేళ హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి ఒక రాత్రి అంతా ఆయనను చిత్ర హింసలు పెట్టారు అన్నది అప్పట్లో పెద్ద సంచలన వార్త. తన మీద ఈ విధంగా చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని రఘురామ నాడే చాణక్య శపథం చేశారు. ఇపుడు ఆ రోజు రానే వచ్చింది. రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో సీఐడీ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన అధికారి విజయపాల్ ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక తనను పోలీస్ కస్టడీలో పెట్తి తనపై విజయపాల్ హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు గతంలోనే ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయపాల్ ను ఒంగోలు పోలీసులు ప్రశ్నించారు. అలా ఆయనను సుదీర్ఘంగా విచారించిన మీదటనే అరెస్ట్ చేశారు. మరో వైపు విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ పోలీసులు సిద్ధం చేశారు. ఇక ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే రఘురామ క్రిష్ణం రాజు ప్రస్తుతం ఉండి శాసనసభ్యుడిగా ఉన్నారు. అంతే కాదు డిప్యూటీ స్పీకర్ గా ఇటీవలనే నియమితులయ్యారు. ఆయన కూటమి ప్రభుత్వం లో బలమైన నాయకుడిగా ఉన్నారు. రఘురామని కస్టడీలో పెట్టి అప్పట్లో తీవ్రంగా ఇబ్బందుల పాలు చేసిన అధికారిగా విజయ్ పాల్ ని చెబుతున్నారు.

తన అరెస్ట్ మీద బెయిల్ కోరుతూ సుప్రీం కోర్టుకు కూడా విజయ్ పాల్ వెళ్లారు. అయితే అక్కడ ఆయన బెయిల్ ని తిరస్కరించారు. ఇక రఘురామ కేసులో ఇది తొలి అరెస్ట్ గా చెబుతున్నారు. ముందు విజయ్ పాల్ అరెస్ట్ అయితే ఇక సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ఉంటారని అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి ఇలా ఈ కేసులో లోతులకు వెళ్తే ఎవరు తెర వెనక ఉన్నారో అందరూ వస్తారు అని అంటున్నారు.

రఘురామ పుట్టిన రోజు కోసం తన సొంత ఇంటికి హైదరాబాద్ వచ్చిన వేళ ఆయనను 2021 మే నెలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు అన్నది అభియోగం. తన మీద తప్పుడు కేసులు పెట్టి సిఐడి కస్టడీలో ఉంచారని అలాగే తనను శారీరకంగా వేధించారని, హింసించారని రఘురామ ఆరోపించిన సంగతి తెలిసిందే.

దీంతో ఏపీ పోలీసులు రఘురామ నిందితులుగా పేర్కొన్న వారందరి మీద హత్య ప్రయత్నం కేసును నమోదు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో నాటి నుంచి ఏపీ పోలీసులు కేసును సీరియస్ గా విచారిస్తున్నారు.

మరో వైపు చూస్తే విజయ్ పాల్ నవంబర్ 13వ తేదీన విచారణకు హాజరైనప్పటికీ సరైన సమాధానాలు చెప్పలేదు. తనపై దాఖలైన పోలీసు కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఇక వైసీపీ ప్రభుత్వంలో తన మీద జరిగిన మొత్తం కుట్ర దాని వెనక ఉన్న వారి మీద కఠిన చర్యలు కోరుతూ రఘురామ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత రఘురామ కేసులో బాగానే డెవలప్మెంట్ కనిపిస్తోంది. ఇక పోలీసుల అదుపులో ఉన్న విజయ్ పాల్ ఇచ్చే వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుంది. ఆయన ఇచ్చే వాంగ్మూలం బట్టి రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News