గ్రాండ్ గా ఓపెన్ అయిన పాకిస్తాన్ మాల్.. అరగంటలో లూటీ..
తక్కువ ధరలకే వస్తువులు అమ్ముతున్నారు అంటే అక్కడికి ఎక్కువమంది వెళ్తారు.
తక్కువ ధరలకే వస్తువులు అమ్ముతున్నారు అంటే అక్కడికి ఎక్కువమంది వెళ్తారు. ఇదే స్ట్రాటజీని ఉపయోగించి మంచి లాభాలు గడించాలి అని ఆశించిన ఒక మాల్ యాజమాన్యం ఇరకాటంలో పడింది. పాకిస్తాన్లోని ఖరాచీలో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటనలో మాల్ మొత్తం లూటీకి గురయ్యింది. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం ఓ బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించడమే దీనికి ముఖ్య కారణం అని తెలుస్తోంది.
సాధారణంగా మాల్స్ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక డిస్కౌంట్ ఆఫర్ పెడుతూ ఉంటారు. అదేవిధంగా కరాచీలో నూతనంగా ప్రారంభమైన డ్రీమ్ బజార్ అనే మాల్ లో కూడా ఓ బంపర్ ఆఫర్ ని ప్రకటించారు. 50 రూపాయల కంటే తక్కువ ధరలకే వివిధ రకాల వస్తువులను ఈ మాల్ లో ఓపెనింగ్ ఆఫర్ కింద అమ్మకానికి పెట్టారు. దీంతో మాల్ కి జనం ఎగబడ్డారు.
అయితే వెళ్ళింది కొనడానికి కాదు.. తమకు తోచిన వస్తువులు తీసుకొని వెళ్లడానికి. దీంతో ప్రారంభించిన అరగంటలోనే మాల్ మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయింది. అంతేకాదు ప్రారంభించిన రోజే మాల్ పూర్తిగా విధ్వంసం అయింది. పాకిస్తాన్లో ప్రారంభించిన తొలి మెగా సేవింగ్ మాల్ కింద సోషల్ మీడియాలో ఈ మాల్ కి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు.
ఓపెనింగ్ రోజు సందర్భంగా దుస్తుల దగ్గర నుంచి వివిధ రకాల గృహోపకరణాల వరకు భారీ డిస్కౌంట్ లను ప్రకటించారు. దీంతో మాల్ ఓపెనింగ్ కి భారీ సంఖ్యలో వచ్చిన జనం చేతికి అందిన వస్తువులను బిల్లు కట్టకుండా పట్టుకుపోయారు. ఒక్కసారిగా అంత గుంపు రావడంతో యాజమాన్యం కూడా తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు.
సోషల్ మీడియాలో ఈ మాల్ దోపిడీకి సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు ఓ లక్ష మందికి పైగా మాల్ లోకి దూరి ఒక్క వస్తువుని కూడా వదలకుండా తీసుకువెళ్లడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. మాల్లో పరిస్థితి కంట్రోల్ చేయడానికి సిబ్బంది తలుపులను మూయడానికి ప్రయత్నిస్తే.. బయట నుంచి అద్దాలు పగలగొట్టుకొని మరీ లోపలికి వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఈ మాల్.. మూడున్నర గడిచే సమయానికి చిన్నాభిన్నం అయిపోయింది.