బీజేపీకి జై కొడుతున్న గ్రంధి ?

వైసీపీకి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజకీయ పయనం ఎటూ అన్న చర్చ అయితే మొదలైంది.

Update: 2024-12-13 11:30 GMT

వైసీపీకి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజకీయ పయనం ఎటూ అన్న చర్చ అయితే మొదలైంది. ఆయన పార్టీని వీడుతూ జగన్ మీద చాలా హాట్ కామెంట్స్ చేశారు. వాటిలో మిగిలినవి ఎలా ఉన్నా జగన్ ఆయనకు ప్రామిస్ చేశారని ప్రచారంలో ఉన్న మాట మేరకు మంత్రి పదవి ఇవ్వకపోవటం మాత్రం కొంత ఆవేదన కలిగించేదే అని అంటున్నారు.

పవన్ ని ఓడించడం అంటే జెయింట్ కిల్లర్ కిందనే చూడాలి. పైగా పవన్ ని రీల్ హీరో అని గ్రంధి శ్రీనివాస్ ని రియల్ హీరో అని జగన్ బహిరంగ సభలలోనే సంభోదించారు. ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. ఇంతలా ఆయనకు కితాబు ఇచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వంలో రెండు దఫాలుగా మంత్రులను తీసుకున్నపుడు కూడా గ్రంధికి చోటు కల్పించకపోవడమే ఈ రోజున ఆయన పార్టీని వీడేందుకు కారణం అయింది అని అంటున్నారు.

అయితే గ్రంధి శ్రీనివాస్ పార్టీని వీడినా ఆయనకు చేరేందుకు పార్టీ ఏది అన్నదే చర్చగా ఉంది. జనసేనలో చూస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేన నుంచే పులపర్తి రామాంజనేయులు బలంగా ఉన్నారు. ఆయన ఉండగా గ్రంధిని చేర్చుకోవడం చేయనే చేయరు. పైగా ఆయన అంటే పవన్ కి ఎంతో గురి ఉంది.

మరో వైపు టీడీపీకి అయితే నేతల కొరతే లేదు. బలమైన నాయకులు ఎంతో మంది ఆ పార్టీలో ఉన్నారు. ఇక గ్రంధి రాకను అటు జనసేన ఇటు టీడీపీ నేతలు కూడా వ్యతిరేకిస్తారు అని అంటున్నారు. దాంతో గ్రంధికి రూట్ ఏదీ అంటే కూటమిలో ఉన్న మూడవ పార్టీ బీజేపీ అని అంటున్నారు.

బీజేపీలో కనుక గ్రంధి శ్రీనివాస్ చేరితే కూటమిలో రేపటి ఎన్నికల్లో పొత్తులలో భాగంగా టికెట్ ని భీమవరం నుంచి సాధించుకునే చాన్స్ అయితే ఉంటుంది అని అంటున్నారు. ఇక కేంద్ర సహాయ మంత్రిగా ఉంటూ నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాసరాజు తో గ్రంధికి మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు.

దాంతో ఆయనతో కలసి బీజేపీ వైపుగానే వెళ్తారు అని అంటున్నారు. బీజేపీకి గోదావరి జిల్లాలలో నాయకత్వ కొరత ఉంది. దాంతో పాటు పార్టీలో ఎవరు చేరినా రెడ్ కార్పెట్ అయితే కచ్చితంగా పరుస్తారు దాంతో గ్రంధి శ్రీనివాస్ చూపు బీజేపీ వైపు ఉందని అంటున్నారు.

మరో వైపు చూస్తే గ్రంధి శ్రీనివాస్ వైసీపీని వీడడానికి అతి ముఖ్యమైన కారణం ఇటీవల ఆయన వ్యాపారాల మీద ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం అని కూడా అంటున్నారు. భీమవరం ప్రకాశం జిల్లాలలో ఉన్న గ్రంధి వ్యాపారాలు ఆక్వా కర్మాగారం మీద కూడా దాడులు జరిగాయని అంటున్నారు.

దీంతో బీజేపీలో చేరితే ఈ కేసుల బెడద నుంచి తప్పించుకోవచ్చు అన్న అభిప్రాయం ఏదో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలా రాజకీయ వ్యాపార కారణాల రీత్యా ఆయన వైసీపీని వీడారని అంటున్నారు మొత్తానికి గ్రంధి బీజేపీలో చేరితే అటు బీజేపీకి ఇటు ఆయనకు కలసి వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News