అమరావతి/విశాఖపట్నం : ఏపీకి ఏది బెస్ట్ రాజధాని అంటే.. గ్రోక్ సమాధానం ఇదీ

అయితే ప్రస్తుతం దూసుకొచ్చిన ఎలన్ మస్క్ ఏఐ గ్రోక్ దీనికి క్లియర్ కట్ గా సమాధానం ఇచ్చింది.;

Update: 2025-03-24 13:48 GMT

ఏపీకి ఏ రాజధాని బెస్ట్..? మౌళిక వసతులు లేని అమరావతినా? అన్నీ ఉన్నా విశాఖపట్నమా? ఏదైతే ఏపీకి సరైన ఎంపిక.. ఈ ప్రశ్న ఆంధ్రులను ఎప్పుడు తొలుస్తూనే ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది కొందరు అమరావతి అంటే.. మరికొందరు విశాఖకు ఓటేస్తారు. అయితే ప్రస్తుతం దూసుకొచ్చిన ఎలన్ మస్క్ ఏఐ గ్రోక్ దీనికి క్లియర్ కట్ గా సమాధానం ఇచ్చింది. అది వైరల్ అయ్యింది.

గత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు.. అయితే, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మళ్లీ ఏకైక రాజధాని వైపు నడుస్తోంది.. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అభివృద్ధి చేయాలని సిబిఎన్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది.

తాజాగా కృత్రిమ మేధస్సు సంచలనం గ్రోక్ కూడా ఆంధ్ర రాజధానిపై చంద్రబాబు విజన్‌ను సమర్థించింది. ఇటీవల, ఒక X వినియోగదారుడు ఆర్థికం నుండి సామాజిక సమ్మిళితత్వం వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి లేదా విశాఖపట్నంలలో దేనిని ఎంచుకోవాలో గ్రోక్‌ను అడిగారు.

దీనికి గ్రోక్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతియే తెలివైన ఎంపిక అని తెలిపింది. మరింత వివరిస్తూ అమరావతి మధ్యస్థంగా ఉందని .. అధిక వ్యయం (రూ. 64,721 కోట్లు) ఉన్నప్పటికీ సామాజికంగా అందరినీ కలుపుకొని పోయేదిగా ఉందని గ్రోక్ పేర్కొంది. "ఇది రైతుల నిబద్ధతను గౌరవిస్తుంది. ప్రాంతీయ ప్రాప్యతను సమతుల్యం చేస్తుంది" అని AI తెలిపింది.

విశాఖపట్నం గురించి మాట్లాడుతూ, "విశాఖపట్నం ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలతో డబ్బును ఆదా చేస్తుంది. ఆర్థిక కేంద్రంగా ఉన్న స్థితిని ఉపయోగించుకుంటుంది. అయితే ఏపీకి ఉత్తరాన ఉండడం ఒక ప్రాంతానికి అనుకూలంగా ఉండవచ్చు. అమరావతి చారిత్రక ప్రాముఖ్యత సాంస్కృతిక వారసత్వంగా ఉంటుంది." అని గ్రోక్ స్పష్టం చేసింది. తద్వారా ఒక ఖచ్చితమైన విశ్లేషణతో ఈ చర్చకు ముగింపు పలికింది.

గ్రోక్ సమాధానం అమరావతి రాజధానికి మద్దతుదారులతో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులు గ్రోక్ అభిప్రాయాలను కేవలం ఒక అభిప్రాయంగా కొట్టిపారేశారు.

Tags:    

Similar News