మీడియాకు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు స్ట్రాంగ్ వార్నింగ్
గుంతకల్లు పట్టణ శివారు కాలనీలో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులకు తీవ్ర స్వరంతో హెచ్చరించడం చర్చనీయాంశమైంది.
అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియాపై చిందులు తొక్కారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడదాం.. అంతేకాని నేను తప్పు చేయకుండా నిందలు వేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
గుంతకల్లు పట్టణ శివారు కాలనీలో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులకు తీవ్ర స్వరంతో హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఆయన మాట్లాడిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఎమ్మెల్యే ఏం అన్నారంటే.. ‘‘ప్రతి మీడియా వారు ఏదైనా ఫ్రెండ్లీగా అడగండి.. ఏం శత్రుత్వం వద్ద.. నేను వెళ్లిన తర్వాత అదీ ఇదీ రాస్తే మాత్రం మీరే అన్నారు పట్టాలపై పడుకోబెడతారని.. మరి అది లేకపోతే.. మీరు నిరూపించకపోతే పట్టాల మీద పడుకోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే.. అన్ని విధాల చేసి వచ్చినోడిని రాసుకోండి. నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రం. మీడియాయేనే కాదు. నేను తప్పు చేయకుండా, నా తమ్ముడు చేశాడని వెనకనుంచి నిందలేయొద్దు. తప్పు చేస్తే నేరుగా అడగండి. సరిదిద్దుకుంటా. మరోసారి హెచ్చరిస్తున్నా.. నాపై రాసినప్పుడు అన్నివిధాలుగా ఆలోచించుకోండి.’’ అంటూ తీవ్ర స్వరంతో మీడియాకు వార్నింగ్ ఇచ్చారు గుమ్మనూరు జయరాం.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యుల ప్రవర్తనపై స్థానిక మీడియాలో కథనాలు వస్తుండటం ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గుమ్మనూరు జయరాం ఎన్నికల ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అప్పట్లో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జయరాంపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించింది. దీంతో టీడీపీలో చేరిన జయరాం పక్కనే ఉన్న అనంతపురం జిల్లా గుంతకల్లుకు మారారు. ఇక్కడా ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తుండటాన్ని ఎమ్మెల్యే జయరాం అంగీకరించలేకపోతున్నారు. దీంతో తనపై వ్యతిరేక కథనాలు ప్రచురిస్తున్న మీడియా తగిన ఆధారాలు చూపాలని కోరుతున్నారు. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది.