ప్రేమపెళ్లికి సిద్ధమైన కూతుర్ని బెదిరించి చంపేసిన తండ్రి.. షాక్ లో పోలీసులు!

తమ కులానికి చెందని కుర్రాడ్ని పెళ్లి చేసుకునేందుకు కూతురు సిద్ధమైన వేళ.. కసాయితనంతో చంపేసిన వైనం పోలీసులు సైతం షాక్ తిన్నారు.;

Update: 2025-03-06 05:30 GMT

తమ కులానికి చెందని కుర్రాడ్ని పెళ్లి చేసుకునేందుకు కూతురు సిద్ధమైన వేళ.. కసాయితనంతో చంపేసిన వైనం పోలీసులు సైతం షాక్ తిన్నారు. సదరు వ్యక్తి చెప్పిన వివరాల్ని నమ్మని పోలీసులు.. అతడిచ్చిన సమాచారాన్ని చెక్ చేయగా.. సగం కాలిన శవం కనిపించటంతో విస్మయానికి గురయ్యారు. గుంతకల్లులో హోటల్ నడిపే వ్యక్తి ఒకరు.. తన కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుందన్న కోపంతో వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే..

అనంతపురం జిల్లా గుంతకల్లులో హోటల్ నడుపుతుంటారు రామాంజనేయులు. ఆయనకు నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తె 20 ఏళ్ల భారతి కర్నూలులో డిగ్రీ చదువుతోంది. అక్కడే ఒక యువకుడ్ని ప్రేమించింది. పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడగా.. కులాలు వేరుగా కావటంతో పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ యువకుడ్ని పెళ్లాడితే తన పరువు పోతుందని భావించారు. అందుకే కూతుర్ని కడతేర్చేందుకు సిద్ధమయ్యాడు.

మార్చి ఒకటిన కుమార్తె భారతిని తన టూవీలర్ మీద తీసుకొని గుంతకల్లు దర్గా సమీపానికి తీసుకెళ్లాడు. ఒక చెట్టు కింద బైక్ ఆపి.. తన వెంట తెచ్చుకున్న తాడును కూతురు చేతికి ఇచ్చాడు. చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోవాలని గద్దించాడు. ప్రేమపరీక్షలో భాగంగా త్యాగానికి సిద్ధమైన ఆమె.. తండ్రి గద్దింపుల వేళ.. చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయింది. కుమార్తె చనిపోయిందన్న విషయాన్ని నిర్దారించుకున్న రామాంజనేయులు.. కూతుర్ని చెట్టు నుంచి కిందకు దించి.. బైక్ లో ఉన్న పెట్రోల్ ఆమె మీద పోసి నిప్పు అంటించాడు.

ఈ దారుణానికి పాల్పడిన నాలుగో రోజున గుంతకల్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి విషయమంతా చెప్పి లొంగిపోయాడు. అయితే.. నిందితుడు చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేకపోవటంతో అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా ఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడ సగం కాలిన శవం కనిపించటంతో నిర్ఘాంతపోయారు. భారతి శవాన్ని ధ్రువీకరించి.. అక్కడే వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.

Tags:    

Similar News