గుత్తా ఫ్యామిలీ కూడా హ్యాండిచ్చేసిందిగా!
సుఖేందర్ కుమారుడు అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు.
గుత్తా ఫ్యామిలీ. తెలంగాణలో వీరి గురించి తెలియని వారు ఉండరు. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయా ల్లో ఉన్నారు. ముఖ్యంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో టీడీపీ, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ ఎస్ పార్టీలో గుత్తా కుటుంబం చక్రం తిప్పింది. కేసీఆర్ కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అయినప్పటికీ.. ఎంపీ టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తి వెంటాడింది. సుఖేందర్ కుమారుడు అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు.
కానీ, బీఆర్ ఎస్ అధినేత టికెట్ నిరాకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్నాళ్లుగా సుఖేందర్ రెడ్డి బీఆర్ ఎస్ అధినేత సహా.. పార్టీపైనా గుస్సాగా ఉన్నారు. ఇటీవల ఆయన దిక్కార స్వరం కూడా వినిపించారు. పార్టీలో స్వేచ్చలేదని.. తనకే అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని సుఖేందర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ పర్వం ఇలా సాగుతున్న సమయంలోనే ఆయన కుమారుడు.. అమిత్ రెడ్డి సంచలనం సృష్టించాడు. నేరుగా పోయి ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
న్యూఢిల్లీలోని ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీని కలిసిన అమిత్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా మార్చుకున్నారు. ఈ పరిణామం.. బీఆర్ ఎస్‌కు పెద్ద దెబ్బగానే పరిణమిం చనుంది. రేపో మాపో.. సుఖేందర్ కూడా.. జంప్ చేయడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. కీలకమైన ఎన్నికలకు ముందు అంతో ఇంతో బలపడాల్సిన పార్టీ.. ఇలా నాయకులను వదులుకుని.. బలహీన పడుతుండడం చర్చనీయాంశంగా మారింది.