వదల బొమ్మాళీ వదల.. పవన్ ను వదలని జోగయ్య!
అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయా స్థానాల పేర్లు, వాటిలో పోటీ చేసే అభ్యర్థులను పేర్లను సైతం సూచిస్తూ హరిరామజోగయ్య పలుమార్లు పవన్ కు లేఖలు రాశారు.;
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన 70 అసెంబ్లీ సీట్లలో లేదా కనీసం 60 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాలని, అధికారంలో వాటా (పవర్ షేరింగ్), రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ హోం మంత్రి హరిరామజోగయ్య.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు పలుమార్లు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయా స్థానాల పేర్లు, వాటిలో పోటీ చేసే అభ్యర్థులను పేర్లను సైతం సూచిస్తూ హరిరామజోగయ్య పలుమార్లు పవన్ కు లేఖలు రాశారు. అయితే పవన్ 24 అసెంబ్లీ సీట్లకు, 3 పార్లమెంటు సీట్లకే పరిమితమయ్యారు. ఆ తర్వాత కూటమిలో బీజేపీ కూడా చేరడంతో 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లలోనే జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
పవన్ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీలోనూ, ఆ పార్టీని అభిమానించే వారిలోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పవన్ తీసుకున్న సీట్లపైన అంతా పెదవి విరిచారు. చంద్రబాబు.. పవన్ ను మోసం చేశాడని ధ్వజమెత్తారు.
అయితే పవన్ వీరందరికీ కౌంటర్ ఇచ్చారు. తనకు సలహాలు ఇచ్చేవారు వద్దని.. తాను చెప్పింది విని తన బాటలో నడిచేవాళ్లే తనకు కావాలంటూ తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఎక్కడో విదేశాల్లో, ఇంట్లో కూర్చుని సలహాలు, సూచనలు ఇవ్వడం తేలికని వ్యాఖ్యానించారు. దీంతో హరిరామజోగయ్య కూడా పవన్ వైఖరితో తాను ఇక ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వబోనని ప్రకటించారు. మరోవైపు జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ వైసీపీలో చేరిపోయారు.
దీనిపైనా పవన్ పరోక్షంగా సెటైర్లు వేశారు. తనతో ఉంటామన్నవారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చూడాలని జనసేన నేతలు, కార్యకర్తలకు చెప్పారు. అయితే తాను మాత్రం జనసేనలోనే ఉంటానని, ఆ పార్టీ మేలు కోసం, పవన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు అండగా ఉంటానని హరిరామ జోగయ్య తెలిపారు.
ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 25 మంది సభ్యులతో కాపు బలిజ సంక్షేమ సేన నూతన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కాపులు, బలిజల సంక్షేమంతోపాటు ఇతర బలహీన వర్గాల వారి సాధికారత కోసం పాటుపడతామని జోగయ్య ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ వర్గాలు ఏదో ఒక రోజు అధికారంలోకి వచ్చేలా, పవన్ కళ్యాణ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టేలా కృషి చేస్తామని హరిరామజోగయ్య తెలిపారు. ఆయా వర్గాలు, ఇతర బలహీనవర్గాల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యే సత్తా పవన్ కళ్యాణ్‌కు ఉందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేస్తానమి చెప్పారు.
అలాగే రాష్ట్రంలో కూటమి గెలుపుకోసం తమ వంతు కృషి చేస్తామని హరిరామజోగయ్య వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని జోగయ్య అన్నారు.
అన్ని పార్టీలు మిగతా వర్గాలకు తాము ఏం చేస్తామో ప్రకటిస్తున్నాయని.. అలాగే కాపుల సంక్షేమం కోసం ఏం చేస్తామో కూడా మేనిఫెస్టోల్లో ప్రకటించాలని జోగయ్య డిమాండ్ చేశారు.