గులాబీ పార్టీలోకి 'గాలి'.. హరీశ్ ప్లానింగా మజాకానా?

మెదక్ సీటును ఆశించే గాలి అనిల్ కుమార్ కు గులాబీ కండువాను కప్పేశారు. దీంతో.. కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లుగా చెబుతున్నారు.

Update: 2023-11-16 16:30 GMT

సమస్యల్ని పరిష్కరించేటోడికే సమస్య వస్తే? ఇలాంటి సీన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అందరిని ఆకర్షిస్తోంది. కారణం.. గులాబీ పార్టీకి ట్రబుల్ షూటర్ గా వ్యవహరించే హరీశ్ కు తొలిసారి బలమైన సవాల్ ఎదురైంది. పెద్ద సారు దగ్గర నుంచి పార్టీకి సంబంధించి ఏదైనా కొరుకుడుపడని పని పడితే హరీశ్ ను రంగంలోకి దించటం.. ఆ వెంటనే దాని లెక్క తేల్చే విషయంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆయనకు.. తాజా ఎన్నికల్లో ఏది ఏమైనా మెదక్ అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ జెండా రెపరెపలాడాలన్న టార్గెట్ ను గులాబీ బాస్ ఇవ్వటం తెలిసిందే.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మెదక్ సీటు మీద మనసు పడటం.. దాన్ని సాధించే క్రమంలో ఎదురుదెబ్బ తగలటం తెలిసిందే. దీంతో గులాబీ కారు దిగేసిన మైనంపల్లి.. ఆయన కుమారుడు హస్తం గూటికి వెళ్లిపోయారు. అనుకున్నట్లే తనకు మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్ ను తెచ్చుకున్న మైనంపల్లి కొడుక్కి మెదక్ కాంగ్రెస్ టికెట్ ను ఇప్పించుకున్నారు. ఇంతకూ హరీశ్ కు.. మెదక్ సీటుకు లింకేమిటంటే.. ఆయన ప్రధమ శిష్యురాలు పద్మాదేవెందర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సీటులో గులాబీ పార్టీ ఓడితే హరీశ్ ఓడిపోయినట్లే.

దీంతో.. తానుపోటీ చేసే సిద్దిపేటతో పాటు మెదక్ స్థానాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత హరీశ్ మీద పడింది. దీంతో.. ఆయన తన వ్యూహాలకు పదును పెట్టారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టని ఆయన.. తాజాగా ఒక బలమైన కాంగ్రెస్ నేతను గులాబీ కారులోకి ఎక్కించటంలో సక్సెస్ అయ్యారు. మెదక్ సీటును ఆశించే గాలి అనిల్ కుమార్ కు గులాబీ కండువాను కప్పేశారు. దీంతో.. కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. గడిచి పదేళ్లలో పటాన్ చెర్వు.. మెదక్ స్థానాలకు సంబంధించి పార్టీకి కొండంత అండగా నిలిచిన గాలిఅనిల్ కుమార్ ఇప్పుడు గులాబీ కారు ఎక్కేయటం కాంగ్రెస్ కు మైనంపల్లి అండ్ కోకు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.

బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గాలి అనిల్ కుమార్ ఇంటికి ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున హరీశ్ ఇంటికి వెళ్లటం.. వారింట్లోనే టిఫిన్ చేయటం ద్వారా.. గులాబీ పార్టీలోకి అనిల్ ను తీసుకురావటంలో ఆయన సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. కీలకమైన పోలింగ్ కు మరో రెండు వారాల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి.

Tags:    

Similar News