కేజ్రీ సొంత రాష్ట్రం హరియాణాలో సున్నా.. ఢిల్లీలోనూ ‘ఆప్’సోపాలే
హరియాణాలో కాంగ్రెస్ ఏడు సీట్లు ఇస్తామని చెప్పినా ఆప్ సొంతంగా బరిలో దిగింది. 90కి 88 స్థానాల్లోనూ పోటీ చేసింది.
‘హరియాణా..’ అటు పంజాబ్ తో ఇటు ఢిల్లీతో సరిహద్దులను పంచుకునే రాష్ట్రం.. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే హరియాణా చుట్టూ ఉన్న ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)నే. అయితే, హరియాణాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది అటుఇటుగా ఒక్క శాతం ఓట్లే. ఇవి నోటా కంటే కాస్త ఎక్కువ అంతే.. సాధించిన సీట్లు సున్నా. కాగా, హరియాణాలో గత ఎన్నికల నాటికి ఢిల్లీలో మాత్రమే అధికారంలో ఉన్న ఆప్.. ఈసారి పంజాబ్ లోనూ పవర్ లో ఉంది. కానీ, హరియాణాలో మాత్రం రాత మారలేదు.
సొంతంగా బరిలో దిగి..
హరియాణాలో కాంగ్రెస్ ఏడు సీట్లు ఇస్తామని చెప్పినా ఆప్ సొంతంగా బరిలో దిగింది. 90కి 88 స్థానాల్లోనూ పోటీ చేసింది. కానీ, ఒక్కచోట కూడా విజయం సాధించలేదు. ఇక సాధించిన ఓట్ల శాతం ఏమైనా పెరిగిందో లేదో చూడాలి. వాస్తవానికి ఈ ఎన్నికల ముందే ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చారు. హరియాణాలో ప్రచారం కూడా చేశారు. కానీ, ఏమీ సాధించలేకపోయారు. కాగా, ఇండియా కూటమి పార్టీలైనప్పటికీ కాంగ్రెస్, ఆప్.. ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. తద్వారా ఓట్లు చీలి బీజేపీ బాగుపడిందని చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ భావించగా.. ఆప్ దానిని దెబ్బకొట్టింది.
ఢిల్లీలో ఏంజరుగుతుందో?
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ఆప్ మరోసారి గెలుస్తుందా? అనేది చెప్పడం కష్టమే అంటున్నారు. కేజ్రీవాల్ పై పడిన అవినీతి మరక అంత సులభంగా తొలగదనేది రాజకీయ విశ్లేషకుల మాట. దీంతోపాటు తాజాగా హరియాణాల ఫలితాల అనంతరం కేజ్రీ మాట్లాడారు. ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలు వస్తున్నాయి. మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎప్పుడూ అతివిశ్వాసంతో ఉండకూడదనేది హరియాణా ఎన్నికలు నేర్పిన పాఠం’’ అని కార్యకర్తలకు సూచించారు.
కేజ్రీ సొంత రాష్ట్రం..
ఆప్ అధినేత కేజ్రీవాల్ కార్యక్షేత్రం ఢిల్లీ అయినా.. ఆయన సొంత రాష్ట్రం హరియాణానే. కానీ, వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ హరియాణాలో ఖాతా తెరవలేదు. దేశంలో ఎక్కడెక్కడో గెలిచిన హరియాణాలో చేతులెత్తేయడం ఎంతైనా కేజ్రీకి ఇబ్బందికరమే. కాగా, హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఉంటే ఆప్ కనీసం ఖాతా అయినా తెరిచేదని.. బీజేపీని ఓడించే అవకాశం కూడా ఉండేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.