ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ చట్టంలో మార్పు
ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ‘‘డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టం-1986’’కు సవరణలు చేసింది.
వైసీపీ హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వంటి వ్యవహారాలు జగన్ ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి. ఆ వర్సిటీని విజయవాడకు తెచ్చిన అన్నగారి పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడంపై అప్పట్లో దుమారం రేగింది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ‘‘డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టం-1986’’కు సవరణలు చేసింది.
హెల్త్ వర్సిటీ చట్టం నుంచి ‘కుష్ఠు, చెవిటి, మూగ’ పదాలను తొలగిస్తూ సభలో బిల్లును ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రవేశపెట్టారు. ఈ వర్సిటీ బోర్డులో కుష్ఠు రోగులు, చెవిటి, మూగ సమస్యలున్న వారు సభ్యులుగా చేరేందుకు అర్హులు కాదని చట్టంలో ఉంది. అయితే, వారిపై వివక్ష చూపకూడదని ఎన్‌హెచ్ఆర్సీ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ క్రమంలోనే ఇకపై వారిని కూడా బోర్డులో సభ్యులుగా ఉండేందుకు అర్హులను చేస్తూ ఆ మూడు పదాలను చట్టం నుంచి తొలగించారు.
సభలో 7 కీలక బిల్లులను శాసన సభ ఆమోదించింది. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు - 2024, ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు - 2024, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సవరణ బిల్లు - 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు - 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు - 2024లను అసెంబ్లీ ఆమోదించింది.