తెలంగాణలో భారీ పోలింగ్.. అంతర్మథనంలో కాంగ్రెస్!
వాస్తవానికి ఎక్కువ పోలింగ్ నమోదైతే.. ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతంగా ఉంటుందన్న చర్చ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో భారీ ఓట్లు నమోదయ్యాయి. కొన్ని చోట్ల పోలింగ్ 94 శాతానికి చేరగా.. రమారమి అన్ని చోట్లా 80 శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఎక్కడా 70 శాతానికి తక్కువగా పోలింగ్ నమోదు కాకపోవడం గమనార్హం. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ అంతర్మథ నంలో పడిపోయింది. వాస్తవానికి ఎక్కువ పోలింగ్ నమోదైతే.. ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతంగా ఉంటుందన్న చర్చ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.
ఎక్కడెక్కడ ఎలా ఎలా?
తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్.. రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ గురువారం ఉద యం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. వరంగల్-నల్గొండ- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోరు సాగింది. ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంచిర్యాల సహా పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఇక, ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పోటీకి దూరంగా ఉంది. అయితే.. లోపాయికారీగా.. వేరే వ్యక్తులకు మద్దతు ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు.. బీజేపీ అభ్యర్థులు, మద్దతు దారులు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేరుగా ప్రచార పర్వంలోకి దిగారు. దీంతో ఎన్నికలు సాధారణ ఎన్నికల పోరును తలపించాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరగడంతో అది తమకు లాభిస్తుందని.. ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
ఎక్కడెక్కడ ఎలా ఎలా ?
+ వరంగల్-నల్గొండ- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి.. 93.55 పోలింగ్ శాతం నమోదైంది.
+ ఒక్క నల్గొండలో 90 శాతం పోలింగ్ నమోదు కాగా.. వరంగల్ జిల్లాలో 80 శాతం పోలింగ్ దాటింది. ఖమ్మంలోనూ 80 శాతం పోలింగ్ నమోదైంది.
+ కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 77.95 శాతం పోలింగ్ దాటినట్టు లెక్కలు చెబుతున్నాయి.
+ కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 82 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఊహించిన దానికన్నా 20 శాతం ఎక్కువని కాంగ్రెస్ నాయకులు చెబుతుండగా.. తాము ఊహించిందనేనని.. రేవంత్ సర్కారుపై విసిగిపోయిన నిరుద్యోగులు.. తమకే మద్దతు పలికారని కమలనాధులు చెబుతున్నారు. కాగా.. ఎన్నికల కౌంటింగ్ మార్చి 3వ తేదీన నిర్వహించనున్నారు.