మహిళలు కురచ బట్టలు కట్టుకోవడం తప్పుకాదు.. కానీ!: బాంబే హైకోర్టు సంచలన తీర్పు
మహారాష్ట్రలోని ప్రముఖ వ్యాపార కేంద్రం నాగపూర్‌లో రిసార్టులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఈ రిసార్టులకు వస్తుంటారు.
దేశంలో మహిళల వస్త్ర ధారణ విషయం దేశంలో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇటు రాజకీయ నేతల నుంచి అటు మఠాధిపతుల వరకు మహిళల వస్త్ర ధారణపై అనేక విమర్శలు, వివాదాలకు కేంద్రంగా మారారు. నిజానికి మహిళల వస్త్ర ధారణకు లేదా పురుషులు ఇలాంటి దుస్తులే ధరించాలంటూ.. ఇటు రాజ్యాంగంలో కానీ.. అటు చట్టాల పరంగా కానీ.. ఎలాంటి నిబంధనలు లేవు. అయినప్పటికీ.. దేశంలో ఎక్కడైనా ఏదైనా అత్యాచారమో, ఘాతుకమో జరిగిన పక్షంలో వెంటనే మహిళల వస్త్ర ధారణపైనా, వారి బాడీ లాంగ్వేజ్‌పైనా విమర్శలు వస్తున్నాయి.
తాజాగా ఇలాంటి కేసు ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. కొందరు మహిళలు కురచ దుస్తులు ధరించి.. డ్యాన్స్ చేశారంటూ.. పోలీసులు కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఇది ఏకంగా బాంబే హైకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిగిపిన న్యాయస్థానం.. మహిళలు కురచ దుస్తులు ధరించడం తప్పుకాదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. వారికి అలాంటి కట్టడి చేసే ఎలాంటి నిబంధనలు లేవని.. కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవసరం లేదని తేల్చి చెప్పింది. ముఖ్యంగా బహిరంగ ప్రాంతాలు కానప్పుడు వారు ఏ దుస్తులు ధరించినా.. అడ్డుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఏం జరిగింది?
మహారాష్ట్రలోని ప్రముఖ వ్యాపార కేంద్రం నాగపూర్‌లో రిసార్టులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఈ రిసార్టులకు వస్తుంటారు. దీంతో వారిని ప్రోత్సహించేందుకు రిసార్టులు అధికారికంగా ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకుని మహిళలతో డ్యాన్సులు చేయిస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట ఓ రెండు రిసార్టులపై పోలీసులు దాడులు చేసి.. కురచ దుస్తులు ధరించి, బెల్లీ డ్యాన్సులు చేస్తున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వీరిపై అశ్లీలత చట్టం కింద కేసులు కూడా నమోదు చేశారు. మహిళల మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అయితే.. పోలీసులు నమోదు చేసిన కేసులపై సదరు మహిళలు కోర్టును ఆశ్రయించారు. బాంబే హైకరో్టు పరిధిలోని నాగపూర్ బెంచ్ ఈ కేసు విచారణను స్వీకరించింది. ఇరు పక్షాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి.. మహిళలు పొట్టి బట్టలు వేసుకుని, రిసార్టులో డాన్సులు చేయడం అశ్లీలతగా పరిగణించలేమని తెలిపింది. అంతేకాదు.. వారు లైసెన్సు తీసుకున్న రిసార్టుల్లోనే డ్యాన్సులు చేశారని, ఆ సమయంలోనే కురచ దుస్తులు వేసుకున్నారని, దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపింది. అలా కాకుండా బహిరంగ ప్రాంతాల్లో వారు కురచ దుస్తులు వేసుకుని, రెచ్చగొట్టేలా డ్యాన్సులు చేస్తే మాత్రమే కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.