జపాన్ ని వణికించిన భారీ భూకంపం.. మళ్లీ సునామీ రాబోతోందా?
అవును... జపాన్ లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది.
సునామీ... ఈ పేరు వింటేనే సముద్రతీర ప్రాంత వాసుల వెన్నులో వణుకు పుడుతుంది! సముద్రం నుంచి రాకాసి అలలు అంతెత్తున లేచి తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి. ఈ సమయంలో గతానుభవాలను ఇప్పటికీ చాలా మంది మరిచిపోని పరిస్థితి. ఈ సమయంలో తాజాగా జపాన్ లో గురువారం భారీ భూకంపం సంభవించింది. దీంతో మరోసారి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
అవును... జపాన్ లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. నైరుతి దీవులైన షికోకో, క్యూషు లను ఇది వణికించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద భవనాలు కంపించాయని అంటున్నారు. దీంతో.. ప్రజలు ఒక్కసారిగా భయాందోళన చెంది ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు!
తాజా భూకంపంతో జపాన్ లోని మియాజాకీ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించగా... జపాన్ తీర ప్రాంతాలైన మియాజాకి, కొచ్చి, ఇహైం, కగోషిమా, ఈటా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. నిచినాన్ నగరంలోని సముద్ర తీరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఈ నేపథ్యంలోనే తీవ్రత ఎక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సమయంలో సముద్రపు అలలు కొన్ని మీటర్ల ఎత్తులో ఎగసిపడతాయని చెప్పిన అధికారులు... సముద్రం వైపు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు. సముద్రతీరానికి సమీపంలో ఉండే ప్రజలు వెంటనే అక్కడ నుంచి దూరంగా వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రజలను జపాన్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
కాగా ఇటీవల జపాన్ లోని ఇషికావాలో కూడా బలమైన భూకంపం సంభవించింది. నోటో ద్వీకకల్పంలో 5.9 తీవ్రతతో భూమి కంపించగా.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అయితే ఆ సమయంలో సునామీ ప్రమాదం ఏమీ లేదని చెప్పిన జపాన్ అధికారులు... తాజా భూకంపంతో మాత్రం సునామీ హెచ్చరికలు జారీ చేశారు.