ఒకటి కాదు.. రెండు కాదు.. 22వేల కోట్ల స్కామ్.. ప్రజలకు సీఎం హెచ్చరిక
ఎన్ని ఘటనలు జరుగుతున్నా తమ దారి తమదే అన్నట్లుగా పెట్టుబడులకు పోతున్నారు.
ఈజీ మనీ కోసం చాలా మంది రకరకాల దారులు వెతుకుంటారు. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ అని.. స్టాక్ మార్కెట్లు అంటూ పెట్టుబడులు పెడుతుంటారు. రూపాయి పెడితే పది రూపాయలు వస్తుందని బ్రోకర్ సంస్థలు మభ్య పెడుతుంటాయి. వాటికి ఫిదా అయిన కొందరు పెట్టుబడులు పెడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు వాటికి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ఒక్కరు చేసిన తప్పిదానికి కుటుంబాలకే కుటుంబాలు బలికావాల్సిన దుస్థితి వస్తోంది. పోలీసులు, అధికారులు ఎంతగా అవగాహన కల్పించినా లాభం లేకుండా పోతోంది. ఎన్ని ఘటనలు జరుగుతున్నా తమ దారి తమదే అన్నట్లుగా పెట్టుబడులకు పోతున్నారు.
అయితే.. ఇలాంటి కుంభకోణమే ఒకటి అసాంలో వెలుగుచూసింది. అక్కడి రాష్ట్ర పోలీసులు ఏకంగా రూ.22 వేల కోట్ల భారీ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చారు. ఈ భారీ కుంభకోణాన్ని గుట్టురట్టు చేశారు. పెట్టుబడిగా పెట్టిన సొమ్మను రెట్టింపు చేస్తామంటూ ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఆహ్వానిస్తూ మోసగాళ్లు ఈ సొమ్మను సేకరించారు.
ఈ దోపిడీలో ప్రధానంగా దిబ్రూఘఢఖ్‌కు చెందిన 22 ఏళ్ల ఆన్‌లైన్ వ్యాపారి విశాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆ పన్నాగానికి తెరలేపాడు. దీంతో వారి మోసాన్ని గుర్తించిన పోలీసులు చివరకు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటే ఈ కుంభకోణంలో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
వ్యాపారవేత్త అయిన విశాల్ తన పరపతిని వాడి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులను సేకరించాడు. కేవలం 60 రోజుల్లోనే వారి పెట్టుబడులపై 30శాతం అధిక లాభాలను ఇప్పిస్తామంటూ నమ్మబలికాడు. అందుకోసం ఓ నాలుగు కంపెనీలను కూడా స్థాపించాడు. ఆ డబ్బులను అస్సామీ చిత్రపరిశ్రమలో పెట్టుబడులు పెట్టి ఆస్తులు సంపాదించాడు. చివరకు ఈ కుంభకోణం వెలుగులోకి రాగా.. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. వీరితో భాగస్వామ్యం పెట్టుకున్న అసామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ఇలాంటి మోసపూరిత ఆన్‌లైన్ బెట్టింగుకు ప్రజలు దూరంగా ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశచూపి ఇలానే మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని కోరారు. తక్కువ టైములో డబ్బును రెట్టింపు చేస్తామన్న మాటలు అబద్ధమని పేర్కొన్నారు.