భారీ వర్షాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో 18 మంది మృతి..రాకపోకలు బంద్!

నాన్ స్టాప్ గా కురుస్తున్న వానలతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.

Update: 2024-09-01 15:24 GMT

నాన్ స్టాప్ గా కురుస్తున్న వానలతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. దీనికి మించి మరో విషాదకరమైన అంశం ఏమంటే.. భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 మంది మరణించారు. తెలంగాణలో తొమ్మిది మంది.. ఏపీలో తొమ్మిది మంది మృతి చెందినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఆదివారం మధ్యాహ్నానికి మరణించిన వారి సంఖ్య 18కి చేరుకుంది.

భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరటంతో వాహన రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ - ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధ్రతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుంచి వరద నీరు దిగువకు భారీగా వస్తున్న వేళ.. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారి మీదకు నీరు చేరింది. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు ప్రయాణాలు ఆగిపోయిన పరిస్థితి నెలకొంది.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద ఉన్న నేషనల్ హైవే మీద మున్నేరు వాగు భారీ ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో.. హైవేపై మోకాళ్ళ లోతులో వరద వస్తున్న పరిస్థితి. దీంతో.. వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి. ఈ కారణంగా.. వాహన రాకపోకల్ని అధికారులు పూర్తిగా నిలిపేశారు. హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద.. విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల్ని బంద్ చేశారు. వరద తగ్గే వరకు హైవే పై ఎవరిని అనుమతించమని స్పష్టం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు.

నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ఇందులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. జాతీయ రహదారులన్ని పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవటంతో హైదరాబాద్ కు వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని సైతం అధికారులు ఆపేశారు. దీంతో.. ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

వర్షం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితి ఉందన్నది చూస్తే..

తెలంగాణ

- తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం మధ్యాహ్నానానికి 9 మంది మరణించినట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. భారీ వర్షాల కరాణంగా మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోందని.. ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయయినట్లు పేర్కొన్నారు.

- హైదరాబాద్ లో శనివారం నుంచి కురుస్తున్న వానలు.. ఆదివారం కంటిన్యూ అయ్యాయి. హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. చాలా ఏళ్ల తర్వాత నిండిపోయిన సాగర్ తూములన్నింటి నుంచి వరద నీరు దిగువకు పారుతోంది. సోమవారం వర్షతీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ మరింత అప్రమత్తమైంది. సోమవారం భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లుగా జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి పేర్కొన్నారు. ఉద్యోగుల సెలవుల్ని రద్దు చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు. జోనల్ కమిషనర్లు 24 గంటలు రోడ్ల మీదే ఉంటున్నారని.. ప్రాణ నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు.

- ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఖమ్మం నగరంలో బీభత్సం క్రియేట్ చేసింది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్ గ్రహకల్పన కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడ ఒక అపార్టుమెంట్ లో ఒక ఫ్యామిలీ చిక్కుకుంది. అందులో చిక్కుకున్న ఏడుగురు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.

- భారీ వర్షాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరాల్సిన రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్ - విశాఖ - హైదరాబాద్ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేశారు. మొత్తం 19 రైళ్లను రద్దు చేస్తూ తాజాగా బులిటెన్ జారీ చేశారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

- భారీ వర్షం ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో పెను విషాదానికి కారణమైంది. కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలోని పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో దంపతులు గల్లంతయ్యారు. పాలేరు అలుగు సమీపంలో ఉన్న సిమెంటు ఇటుకల తయారీ కర్మాగారంలో ఒక కుటుంబం నివసిస్తోంది. పాలేరు జలాశయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచి వరద పోటెత్తింది. దీంతో షేక్ యాకుబ్.. భార్య సైదాబి.. కొడుకు షరీఫ్ లు వరదలో చిక్కుపోయారు. వరద తీవ్రతకు వారిద్దరు గల్లంతు కాగా.. వరదలో కొట్టుకుపోతున్న షరీఫ్ ను పోలీసులు కాపాడారు.

ఏపీ

- భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలతో ఏపీలో వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాల్ని కాపాడటమే తమ ప్రభుత్వ కర్తవ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వరద పరిస్థితుల నేపథ్యంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. విజయవాడ.. గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని.. అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందన్న చంద్రబాబు.. గుంటూరు, విజయవాడలలో సహాయక చర్యల్ని చేపట్టినట్లు చెప్పారు.

- ఇప్పటివరకు రాష్ట్రంలో కురిసిన వర్షాలు.. వరదల కారణంగా తొమ్మిది మందిని కోల్పోయామని.. ఒకరు గల్లంతైనట్లుగా చెప్పారు చంద్రబాబు. కొండ చరియలు విరిగిపడటం.. కారులో చనిపోవటం.. వాగులో కారు కొట్టుకుపోయిన ఉదంతంలో ముగ్గురు మరణించటం బాధాకరమన్నారు. ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల వర్షపు నీరువస్తోందన్నారు.

- వీటీపీఎస్ లో విద్యుదుత్పత్తి ఆగిందని.. ప్రకాశం బ్యారేజీ కింద చాలా చోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయని.. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టామని.. 17 వేల మందిని తరలించామన్న చంద్రబాబు.. అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని.. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని.. పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామన్నారు.

- పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా అధికారులు కొండ దిగువన ఉన్న చెక్ పోస్టు వద్ద వాహన రాకపోకల్ని నిలిపివేశారు.

Tags:    

Similar News